క్యాంపు పాలిట్రిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

క్యాంపు పాలిట్రిక్స్‌

Feb 13 2026 5:37 AM | Updated on Feb 13 2026 5:37 AM

క్యాంపు పాలిట్రిక్స్‌

క్యాంపు పాలిట్రిక్స్‌

సాక్షి, సిద్దిపేట: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు ముందే క్యాంప్‌ రాజకీయాలకు ప్రధాన పార్టీలు తెరలేపాయి. గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపొందిన కౌన్సిలర్లు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ముందస్తుగానే హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె శివారులోని పాంహౌస్‌లకు, రిసార్టులతో పాటు విహార యాత్రకు తరలిస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డుల్లో 326 మంది పోటీ చేయగా అందులో దాదాపు 150 మంది అభ్యర్థులను ఆయా ప్రధాన పార్టీలు క్యాంపునకు తరలిస్తున్నాయి. ఓటరు నాడి ఎటు ఉందో లెక్కలు వేసుకున్న రాజకీయ దిగ్గజాలు తమ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఆకర్ష్‌ మంత్రానికి చిక్కకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు. ఈ నెల 16న మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు గెలిచిన వారికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి.

ఇండిపెండెంట్లపై ప్రత్యేక దృష్టి

గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లకు ప్రధాన పార్టీలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీలు మ్యాజిక్‌ ఫిగర్‌కు దగ్గరగా ఉంటే గెలుపొందిన ఇండిపెండెంట్ల అవసరం తప్పనిసరి కానుంది. దీంతో ముందస్తుగానే ఇండిపెండెంట్లుగా గెలిచే వారిని సైతం క్యాంపునకు తీసుకువెళ్లారు.

గెలిచే అభ్యర్థులందరినీ..

గెలిచే అవకాశాలున్న అభ్యర్థులందరిని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు క్యాంపునకు పంపించాయి. శుక్రవారం ఫలితాలు వెలువడ్డాక.. గెలుపొందిన వారిని క్యాంప్‌లోనే ఉంచి ఓటమి చెందిన వారిని ఇంటికి పంపించనున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు గెలుపొందితే నేరుగా విజేతలు ఈ నెల 16న చైర్మన్‌ ఎన్నిక జరిగే చోటకే రానున్నారు. వారిని ఎక్కడికి తీసుకెళ్లారనేది గోప్యంగా ఉంచుతున్నారు.

ముందే అభ్యర్థులను తరలించిన ప్రధాన పార్టీలు

గెలిస్తే క్యాంప్‌లోనే.. ఓటమి చెందితే ఇంటికి

నేరుగా ఈ నెల 16న వచ్చే విధంగా ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement