ప్రజాబాటతో సమస్యల పరిష్కారం
వర్గల్(గజ్వేల్): గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహిస్తోందని టీజీఎస్‌పీడీసీఎల్ రూరల్‌జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి అన్నారు. వచ్చే వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం పవర్ ట్రాన్స్‌ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇంటర్‌లింకింగ్, బైఫరికేషన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం వర్గల్ మండలం తున్కిఖాల్సాలో విద్యుత్ అధికారులు నిర్వహించిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమం జరుగుతుందని, విద్యుత్ శాఖ అధికారులు గ్రామాలను సందర్శించి విద్యుత్ సంబంధ సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తారన్నారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను డిపార్ట్‌మెంట్ వాహనంలోనే రిపేరింగ్ సెంటర్‌కు తరలించాలని స్పష్టం చేశారు. గృహ, వ్యవసాయ, వాణిజ్య తదితర అన్ని కేటగిరిల విద్యుత్ వినియోగదారులు కిలోమీటర్ పరిధిలో (తాత్కాలిక కనెక్షన్ మినహా) కొత్త సర్వీస్ కనెక్షన్ల కోసం నిర్ణీత చార్జీలు చెల్లించి దరఖాస్తు చేస్తే ఉచితంగా లైన్ నిర్మింపజేసి సర్వీస్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఉత్తమ సేవలందించిన ఏఎల్‌ఎమ్ నవీన్‌ను ఆయన శాలువాతో సత్కరించారు. కాగా గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోరుతూ సర్పంచ్ గణేష్ సీఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ చంద్రశేఖర్, గజ్వేల్ డీఈ భానుప్రకాశ్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వాసుదేవరావు, సర్పంచ్ గణేష్, విద్యుత్‌శాఖ లైన్‌ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
టీజీ ఎస్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి


