గజ్వేల్‌పైనే అందరి దృష్టి
● అగ్రనేతల ప్రచారంతోపొలిటికల్ హీట్
● చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్న పార్టీలు
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడంతో బీఆర్‌ఎస్‌తోపాటు అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకొని అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించడం, ప్రచారపర్వంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. ఎలాగైనా మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా చైర్మన్ పీఠం కై వసం చేసుకోవడానికి పార్టీలు పావులు కదుపుతున్నాయి. – గజ్వేల్
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రారంభం నుంచి ప్రచారం గడువు ముగిసిన సోమవారం వరకు ఆద్యంతం ఆసక్తికరమైన పరిస్థితి నెలకొన్నది. పట్టు సాధించడానికి పార్టీలు కట్టుదిట్టమైన వ్యుహాలతో ముందుకుసాగటం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్‌కు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర మంత్రులు వివేక్, అజారుద్దీన్‌తోపాటు రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆయన కూతురు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం శ్రమించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి హరీశ్‌రావు రెండు పర్యాయాలు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. కానీ ఈనెల 7న ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నిర్వహించే ప్రచారానికి హరీశ్‌రావు వస్తారని తెలిసి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్వాసితులు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం, ఉద్రిక్తత నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు ప్రచార కార్యక్రమాలను హోరెత్తించారు. బీజేపీలో జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లు పాల్గొన్నారు.
చిట్టచివరి అవకాశాలపై దృష్టి..
గెలుపు కోసం చిట్టచివరి అవకాశాలపై పార్టీల ప్రధానంగా దృష్టి పెట్టాయి. ప్రచారం పూర్తయి.. ఇక ప్రలోభాల పర్వం మిగిలిపోగా నోట్ల మంత్రాంగంలో నేతలు నిమగ్నమై ఉన్నారు. ఓటరు కు నేరుగా నగదు పంపిణీ చేస్తే..ఇబ్బందులు వస్తున్నాయని, ఫోన్‌పే, లేదా గూగుల్ పే ద్వారా అభ్యర్థులు డబ్బులు పంపడానికి ప్రయత్నిస్తున్నా రు. ఫోన్ నెంబర్లు దొరకని వారికి ఒక్కో వార్డు లో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ జరుగుతున్నదని తెలిసింది. మొత్తానికి చివరి అంకం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
చైర్మన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యం
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ముందుకుసాగుతున్నాయి. కాంగ్రెస్‌లో చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకోసం ఓ మహిళ నేత ప్రముఖంగా పోటీపడుతుండగా, మరొకరు సైతం పోటీలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌లో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. నలుగురు మహిళ నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ సతీమణి కల్యాణి పేరును దాదాపుగా ప్రకటించారు.


