కాంగ్రెస్‌ది అసమర్థ పాలన
దుబ్బాక: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఒక్క పనిచేయని దద్దమ్మ సర్కార్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సోమవారం దుబ్బాక పట్టణంతో పాటు మున్సిపాలిటీలోని దుంపలపల్లి, చెల్లాపూర్, లచ్చపేట ల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి అన్నడు, రైతు భరోసా, పంట బోనస్, స్కూటీలు, తులం బంగారం అంటు ఇలా 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని రేవంత్ సర్కార్‌కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టడడమే తప్పా రేవంత్‌కు మరోపని లేదన్నారు. ఇంకా రెండున్నరేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ప్రజలు ఏం ఆందోళన చెందవద్దన్నారు. రైతులకు రుణమాఫీ లేదన్నారు. రైతు బంధు ఎగ్గొడుతున్నారని, యూరియా అందక రైతులు నరకయాతన పడుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. పోరాటాల పురిటిగడ్డ చైతన్యం గల దుబ్బాక ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.బీజేపీ దుబ్బాకలో గెలిచేది లేదు పెద్దగా వారితో ఒరిగేదేంలేదన్నారు. ప్రజలసంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మన ఇంటి పార్టీ బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు.
ఓటుతో బుద్ధిచెప్పాలి
‘ఎలుక తోలు ఏడాదంతా ఉతికినా నలుపేగాని తెలుపుకాదు అన్నట్లు.. హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్లినా రేవంత్‌రెడ్డి తిట్ల దండకం ఆగలేదు.. గుణం మారలేదు.. నోరు తెరిస్తే బూతులే’నని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తానని దేవుళ్లమీద ప్రమాణం చేసి మోసం చేసిన రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోరు తెరిస్తే బూతులు తిడుతున్న రేవంత్‌కు పోలింగ్ బూత్‌లో ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్‌రెడ్డికి ఉమ్మడి మెదక్‌జిల్లాకు వచ్చేందుకు ముఖంలేదన్నారు. హామీలిచ్చి మోసం చేసిన సర్కార్‌కు ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు. వాడిపోయిన కమలం పువ్వు గురుంచి మాట్లాడటం దండగ అన్నారు.
రెండున్నరేళ్లలో
ఒక్కపనిచేయని సర్కార్
బీజేపీ గెలిచేది లేదు..వారితో పెద్దగా ఒరిగేదేమీలేదు
దుబ్బాకలో మాజీ మంత్రి హరీశ్‌రావు


