నిధుల వరద.. కాసుల వేట
పాపన్నపేట(మెదక్): ‘పంచాయతీరాజ్ శాఖ ద్వారా గత ఏడుపాయల జాతరకు సంబంధించి రూ. 22.30 లక్షల పనులు చేస్తే, చెక్ నంబర్ 649125తో రూ. 20 లక్షలు ఎమర్జింగ్ టెక్నో సర్వీసెస్’ అనే ఒక ఫర్మ్‌కు చెల్లించారు. అది కూడా ఓ స్థానిక నాయకుడికి చెక్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి జాతర పనులు టెండర్లు నిర్వహించకుండా, నాయకులు సూచించిన ఫర్మ్ (సంస్థ)లకే అప్పజెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జాతర వచ్చిందంటే పండుగే
స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ వినియోగం దారి తప్పుతోంది. లక్షలాది భక్తుల ఆనందం కోసం సంబరంగా నిర్వహించాలనుకున్న మహా జాతర.. కాంట్రాక్టర్లకు.. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2024– 25 శివరాత్రి జాతరకు రూ. 2 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు కాగా, ఏడుపాయల ఈఓ ద్వారా రూ. 93,04,139 ఖర్చయ్యాయి. ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా రూ.1,06,95,861 ఖర్చు చేశారు. జాతరలో సుమారు 33 శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ శాఖ, ఫిషరీస్, పోలీస్, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా రూ. 90.80,254 ఖర్చు చేశారు. ఇందులో కూడా సింహభాగం తాత్కాలిక పనులే. ఏజెన్సీల పేరిట స్థానిక నాయకులే పని చేసి, అధికారులకు, ఏజెన్సీలకు ఎవరి వాటాలు వారికి ముట్ట జెప్పారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా రూ. 5 లక్షలు దాటితే టెండర్ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకే ఏజెన్సీకి రూ. 20 లక్షల చెక్కు ఇవ్వడం గమనార్హం.


