ఎన్నికలకు సర్వం సిద్ధం
● మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి
● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: మున్సిపాలిటీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హైమావతి సోమవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు జరగనున్న 4 మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 4 మున్సిపాలిటీలలో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 176 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. 1069 మంది పోలింగ్ సిబ్బంది, మొత్తం 18 రూట్లను, 22 మంది జోనల్ అధికారులను నియమించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని వివరించారు. 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 31 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామన్నారు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని, ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో కేటాయించారు. చేర్యాల మున్సిపాలిటీకి147 మంది, హుస్నాబాద్ మున్సిపాలిటీకి 240 మంది, దుబ్బాక మున్సిపాలిటీకి 246 మంది, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 436 మందిని కేటాయించినట్లు తెలిపారు.
సమన్వయంతో పనిచేయండి
హుస్నాబాద్: ఎన్నికలు సజావుగా జరిగేందుకు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌటింగ్ హాల్, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్, పోలీస్ సిబ్బందికి భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.


