చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి
● మంత్రి పొన్నం ప్రభాకర్
● కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
హుస్నాబాద్: పాత కాలం వారు మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు సేవలను ఎలా గుర్తు చేసుకుంటున్నారో హుస్నాబాద్‌లో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేసి తీరుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మున్సిపాలిటీల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్ల చరిత్రలో మొదటి సారి మంత్రి అయ్యే అవకాశం హుస్నాబాద్‌కు వచ్చిందన్నారు. భవిష్యత్‌లో నీటి చుక్క దుకాణాల్లోకి రాకుండా రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో పనులు ప్రారంభించామన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా హుస్నాబాద్‌ను కరీంనగర్ మున్సిపాలిటిలో కలపడం తథ్యమన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. బస్‌స్టేషన్‌ను అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలకు బస్సులు వెళ్లేలా చేశామన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 600 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో హుస్నాబాద్‌ను జిల్లా కేంద్రంగా మార్చేలా అభివృద్ధి చేసితీరుతామన్నారు.


