పొద్దుతిరుగుడు సాగు లాభదాయకం
● ప్రత్యామ్నాయ పంటలే మేలు
● వ్యవసాయ శాఖ ఏడీఏ వీణారెడ్డి
అక్కన్నపేట(హుస్నాబాద్): పొద్దుతిరుగుడు పంట రైతులకు లాభసాటిగా ఉంటుందని, తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని హుస్నాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ వీణారెడ్డి అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలం కట్కూర్‌లో యాసంగి పొద్దుతిరుగుడు సాగుపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులు యాసంగిలో బావులు బోర్లపైనా నీటికోసం ఆధారపడి వరిసాగు చేస్తున్నారన్నారు. కానీ చివరి దశలో నీరు అందకపోవటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అదే కాకుండా వరి పంట తర్వాత మళ్లీ వరి సాగు చేయడంతో భూసారం తగ్గి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక నష్టపోతున్నారన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు పంటను పండిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి, ఆత్మ కమిటీ చైర్మన్ జంగపల్లి అయిలయ్య, మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా, ఏఈఓ ఐశ్వర్య, కట్కూర్ సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


