పకడ్బందీగా ప్రభుత్వ భూముల సంరక్షణ
● కలెక్టర్ హైమావతి
● ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం
సిద్దిపేటరూరల్: ప్రభుత్వ భూముల సంరక్షణతో పాటు రెవెన్యూ రికార్డుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా వివిధ రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థ చాలా ముఖ్యమైనదన్నారు. భూ సంబంధిత సమస్యలు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా ఉంటుందన్నారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి, భూ సమస్యలు లేకుండా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. చట్టం ప్రకారం భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, సిద్దిపేట, హుస్నాబాద్ ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.


