చేతిలోని ఫోన్‌ను కొట్టేసిన దొంగలు
మీర్‌పేట: ఇంటి ముందు నిలబడ్డ వ్యక్తి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయకహిల్స్ కాలనీకి చెందిన జంపాలా రమేశ్ సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆయన పని నిమిత్తం అంబర్‌పేటకు వెళ్లి అర్ధరాత్రి 1.40 గంటలకు తిరిగి వచ్చి ఇంటి ముందు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇందులోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. అనంతరం తేరుకున్న ఆయన వెంబడించినప్పటికీ వారు దొరకలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: కుటుంబ కలహాల కారణంగా గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ కడారి నరేష్, శరణ్య(33) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. దంపతుల నడుమ చిన్న చిన్న గొడవలున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీన సాయంత్రం వేళ బయటికి వెళ్లొస్తానని పిల్లలకు చెప్పి వెళ్లిన శరణ్య తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో, నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మట్టి టిప్పర్ల పట్టివేత
కేశంపేట: టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని సీజ్ చేసిన సంఘటన మండల పరిధిలోని బైర్కాన్‌పల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామానికి చెందిన లక్ష్మణ్ బైర్కాన్‌పల్లి గ్రామ శివారులోని తట్టెకుంటతండా సమీపంలో మట్టిని తోడి అదే గ్రామంలో మరోచోటుకు తరలిస్తున్నారు. ఈ మేరకు పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో వాహనాలను స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు.
చేతిలోని ఫోన్‌ను కొట్టేసిన దొంగలు


