432 ఎకరాలే పెండింగ్
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణ పూర్తయినట్లేనని, కోర్టు పరిధిలో ఉన్న 432 ఎకరాల పట్టా భూమికి సంబంధించిన వివాదం మాత్రమే పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లోని పది గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 19,333 ఎకరాల భూసేకరణకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సింహభాగం యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్దలో పది వేల ఎకరాల అసైన్డ్, పట్టా భూమిని సేకరించడానికి నిర్ణయించింది. ఇందులో ఏడు వేల ఎకరాలకుపైగా భూమిని(ప్రస్తుతం ఈ భూముల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది) సేకరించారు. అయితే, 2,200 ఎకరాల పట్టా భూములకు సంబంధించిన రైతులు ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదంటూ కోర్టుకు వెళ్లారు. దీంతో రాత్రికి రాత్రే అవార్డులు పాస్ చేసిన అధికారులు 800 మందికి పైగా రైతుల సుమారు 1,800 ఎకరాల పట్టా భూముల పరిహారాన్ని అథారిటీలో జమ చేశారు. వీరి పేర్లపై ఉన్న భూరికార్డులను టీజీఐఐసీకి బదలాయించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు యాచారం తహసీల్దార్ ఈ పనిలో నిమగ్నమయ్యారు.
దాదాపు పూర్తయిన
ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియ
పరిహారం డబ్బులు అథారిటీలో జమ
మున్సిపల్ ఎన్నికల తర్వాత
రైతులకు ప్లాట్ల పంపిణీ
రైతులు ఆగం కావద్దు
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులు ఇతరుల మాటలు విని ఆగం కావద్దు. మీ పరిహారాన్ని అథారిటీలో జమ చేశాం. ఇక మా చేతుల్లో ఏమీ లేదు. మీరే వెళ్లి డబ్బులు తెచ్చుకోవచ్చు. పరిహారం పెంచే విషయం అథారిటీ జడ్జి నిర్ణయిస్తారు. కేవలం 432 ఎకరాలే వివాదంలో ఉన్నట్లు గుర్తించాం. రిజిస్ట్రేషన్లు చేసిన రైతులకు త్వరలోనే ప్లాట్ల డాక్యుమెంట్లను పంపిణీ చేస్తాం.
– అనంత్‌రెడ్డి, ఆర్డీఓ ఇబ్రహీంపట్నం


