గిట్టుబాటు లేక.. నిరుపయోగంగా వదిలేసి..
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లోని పార్కింగ్ స్టాండ్ నిరుపయోగంగా మారింది. దీనిద్వారా సమకూరే ఆదాయాన్ని పరిశీలించకుండా రైల్వే ఉన్నతాధికారులు ఊహాజనిత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ మొత్తానికే టెండర్లు ఆహ్వానించడంతో అధిక మొత్తంలో కోట్‌చేస్తున్న కాంట్రాక్టర్లు.. ఆశించిన ఆదాయం రాక కొద్దికాలానికే పార్కింగ్ స్టాండ్‌ను మూసివేస్తున్నారు. దీనిద్వారా రైల్వేకు నష్టాలు వస్తున్నాయి.
ఎన్‌ఎస్‌జీ–4 కేటగిరీలో రామగుండం
భారతీయ రైల్వేలో నాన్ సబర్బన్ గ్రేడ్ (ఎన్‌ఎస్‌జీ)–4 కేటగిరీలో రామగుండం రైల్వేస్టేషన్ ఉంది. ఎన్‌ఎస్‌జీతోపాటు సబర్బన్ గ్రేడ్(ఎస్‌జీ), హాల్ట్ గ్రేడ్(హెచ్‌జీ) వంటి కేటగిరీలు రైల్వేలో ఉంటాయి. ఎన్‌ఎస్‌జీ–4 కేటగిరీ మధ్యస్థ స్థాయి (మంచి ఆదాయం, ఎక్కువ సంఖ్యలో రైళ్ల హాల్టింగ్) ఉంటే మంచిస్థాయి స్టేషన్‌గా పరిగణిస్తారు. ప్రతీరోజు గరిష్టంగా ఐదువేల మంది ప్రయాణికులు, 80 పైబడి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఆదాయం రాక వదిలించుకున్న గత కాంట్రాక్టర్
రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేసేందుకు వేర్వేరుగా రెండు స్టాండ్‌లు ఉన్నాయి. ఒక పార్కింగ్ స్టాండ్ నిర్వహణ బాధ్యతలను గతేడాది జూలై 2024లో ఓ కాంట్రాక్టర్ మూడేళ్ల కాలానికి రూ.7,30,125(18శాతం జీఎస్‌టీతో కలిపి) టెండర్ పొందాడు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించక రెండు నెలల్లోనే తప్పుకున్నాడు. జనవరి 19న మరోసారి రూ.3,47,062.74కు టెండర్లు ఆహ్వానించగా.. ఒకరు రూ.3,46,370, మరొకరు రూ.3,45,678 కోట్‌చేశారు. రైల్వేశాఖ నిర్ణయించిన ఆదాయం రాకపోవడంతో ఆ టెండర్లు ఖరారు చేయకుండా హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం.
ఊహాజనిత నివేదికల ఆధారంగా టెండర్లు
నష్టపోతున్న వాహన పార్కింగ్ స్టాండ్ కాంట్రాక్టర్లు
ఆదాయం కోల్పోతున్న రైల్వే శాఖ
గిట్టుబాటు లేక.. నిరుపయోగంగా వదిలేసి..


