కార్యదర్శులకు ‘పన్ను’పోటు | - | Sakshi
Sakshi News home page

కార్యదర్శులకు ‘పన్ను’పోటు

Feb 14 2026 10:03 AM | Updated on Feb 14 2026 10:03 AM

కార్యదర్శులకు ‘పన్ను’పోటు

కార్యదర్శులకు ‘పన్ను’పోటు

ఇంటి పన్ను వసూళ్లకు నెలాఖరు వరకు గడువు

సర్వేలతో ఉక్కిరిబిక్కిరి..

బేస్తవారిపేట:

ంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు ఇంటి పన్ను వసూళ్లు గుదిబండగా మారాయి. ఏకంగా ఉద్యోగాలకే ఎసరు తెస్తున్నాయి. ఈనెల 15లోగా 50 శాతం, నెలాఖరులోగా 100 శాతం వసూళ్లు పూర్తి చేయాలని టీడీపీ సర్కారు ఆదేశించింది. గడువులోపు వసూళ్లు చేయకుంటే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించింది. స్వర్ణాంధ్ర అంటూ పేర్లు పెట్టి కింది స్థాయి ఉద్యోగుల బాధలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. దీనిపై కార్యదర్శులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 530 మంది, మార్కాపురం జిల్లాలో 373 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1058 స్వర్ణ గ్రామం–స్వర్ణవార్డ్‌లు ఉన్నాయి. వీటిలో 9473 మంది ఉద్యోగులు సనిచేస్తున్నారు. 903 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

ప్రతి ఏడాది మార్చిలో..

ప్రతి ఏడాది ఇంటిపన్ను వసూళ్లు మార్చి నెలలో డిమాండ్‌ నోటీస్‌లు జారీ చేసి ఆ నెలాఖరు, ఏప్రిల్‌ చివరకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరెక్కడా అప్పు పుట్టక తమపై పడిందంటూ గ్రామ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మెడపై కత్తి పెట్టి పన్నులు వసూలు చేయాలని చెప్పడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

అసంబద్ధంగా సస్పెన్షన్‌..

ఈనెల 15వ తేదీలోపు 50 శాతానికి మించి పన్ను వసూలు చేయలేని కార్యదర్శుల్లో మండలానికి ఒకరిని సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు దిగడమే కాకుండా బేస్తవారిపేట మండలంలోని అక్కపల్లె పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. బసినేపల్లె పంచాయతీ కార్యదర్శి పన్నుల వసూళ్లలో మండలంలో 11వ స్థానంలో ఉన్నాడు. పన్ను వసూళ్లలో ఇతనికంటే 8 పంచాయతీలు వెనుకబడి ఉన్నాయి. అయినా ఎవరో ఒకరిని బలిపశువుగా మార్చాలని చేసినట్లు అర్థమవుతోంది.

క్యూఆర్‌ కోడ్‌ నిబంధనతో ఇక్కట్లు..

గతంలో ఇంటి పన్ను వసూళ్లు ఆఫ్‌లైన్‌లో కట్టించుకునేవారు. ఇంటింటికీ తిరిగి వసూలు చేసి రశీదులు ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం క్యూఆర్‌కోడ్‌ ద్వారా చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న గృహ యజమానులు మాత్రమే ఇది చేసేందుకు అవకాశం ఉంది. పల్లెల్లో ఎక్కువ శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌ సౌకర్యం, ఆన్‌లైన్‌ లావాదేవీల చెల్లింపు తెలియకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇంటిపన్ను వసూళ్ల కార్యక్రమం మందకొడిగా సాగుతోంది.

గడువులోపు పూర్తి చేయకుంటే సస్పెన్షన్‌

ఇప్పటికే పలువురు కార్యదర్శులపై వేటు

ఆందోళనలో పంచాయతీ కార్యదర్శులు

పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పలు సర్వేలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వామిత్వ సర్వే, యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే, ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ నిర్వహణ, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, ప్రోన్‌యాప్‌ నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ, మనమిత్ర అవేర్‌నెస్‌, ఎస్‌ఏఎస్‌ఏ కార్యక్రమాలు, ఇతర యాప్‌ల నిర్వహణతోపాటు గ్రామ సభల విధుల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. క్షేత్ర స్థాయిలో పలు సమస్యలతో ఇంటిపన్ను వసూలు చేయలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి పెంచడంతో వయస్సు పైబడిన కార్యదర్శులు బీపీ, షుగర్లు పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు ఇది చేస్తాం..అది చేస్తామని ఆశలు పెట్టారని, కానీ తమకేమీ మేలు చేయకపోగా, పనిఒత్తిడి పెంచి పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేయడంతో మానసిక క్షోభకు గురవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement