హామీలకు సున్నం.. అభివృద్ధి శూన్యం
కొండపి: ఎన్నికల వేళ టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాష్ట్రానికి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారని, గడిచిన 20 నెలల్లో కొత్తగా తెచ్చిన పరిశ్రమ ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని హామీని నెరవేర్చకపోగా, భారీగా ఉద్యోగాలు కల్పిస్తున్న డప్పు కొట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. శుక్రవారం కొండపిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు అధ్యక్షతన పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు మోసపూరిత ప్రకటలను చూసి టీడీపీ నాయకులే విస్తుపోతున్నారని చెప్పారు. తామంతా మోసపోయామని ఇప్పటికే ప్రజలు గ్రహించారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు. కొత్త పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు చేయకపోగా భర్త చనిపోయిన వారికి సైతం పింఛను ఎగ్గొట్టడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండానే.. నిధులు విడుదల చేసినట్లు క్షీరాభిషేకాలు చేయడం సిగ్గుచేటన్నారు. కొండపి నియోజకవర్గంలో ఒకరు అధికారికంగా, మరొకరు అనధికారికంగా మంత్రులుగా చెలామణి అవుతున్నా ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పాకలలో శాశ్వత పర్యాటకాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా.. బీచ్ ఫెస్టివల్ పేరుతో జబర్దస్త్ షోలు చేస్తే ఉపయోగమేమిటని ప్రశ్నించారు.
కార్యకర్తలే పార్టీకి బలం
క్షేత్రా స్థాయిలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి జగనన్న 2.0లో సముచిత స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు మోసాలు, అక్రమాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ గ్రామ కమిటీలను ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, 2029 ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. రెడ్‌బుక్ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. 2029 ఎన్నికల్లో కొండపి గడ్డపై వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇద్దామన్నారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో మండల పరిశీలకుడు కొమ్మాలపాటి మదన్‌మోహనరావు, గొట్టిపాటి మురళి, బొక్కిసం సుబ్బారావు, వైస్ ఎంపీపీ రావులపల్లి కోటరాజు, మండవ మాలకొండయ్య, మణికంఠేశ్వర్ రెడ్డి, శివకృష్ణ, నరసారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భువనగిరి సత్యనారాయణ, రమేష్ సాంబశివరావు, వన్నూరు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారావు, వేణు, విజయరామరాజు, రవీంద్రారెడ్డి, సుబ్బయ్య, గంగాధర్ రెడ్డి, హరినారాయణ, కొర్నేలు, కోటి శేఖర్‌రెడ్డి, రెడ్డి రమణారెడ్డి, చిన్నబ్బాయి, నజీర్, శ్రీహరిబాబు, మోపర్తి నారాయణ, వెంకటనర్సు, గోవిందు, ఆదాము, నరసింహారావు, సుబ్బయ్య, శ్రీనివాసరెడ్డి, శ్రీను, చిన్న వసంత రావు, బ్రహ్మారెడ్డి, నాగిరెడ్డి, నాగుర్, బ్రహ్మయ్య, వినోద్ పాల్గొన్నారు.
పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చంద్రబాబు అండ్ కో బోగస్ ప్రకటనలు
గడిచిన 20 నెలల కాలంలో యువతకు ఇచ్చిన ఉద్యోగాలెన్ని?
జగనన్న 2.0లో పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం
వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్
హామీలకు సున్నం.. అభివృద్ధి శూన్యం


