
చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్లమెంట్‌లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందుతున్నారు.


ఇదీ చదవండి: వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే
ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill) విషయంలో రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోపక్క బిల్లుకి మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్‌లపై మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.