తెలంగాణ శత్రుదేశమా? కేంద్రం వైఖరిపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం

Telangana Minister KTR Fires On Central BJP Govt - Sakshi

ఏజీవర్సిటీ (హైదరాబాద్‌): కేంద్ర ప్రభుత్వం తెలంగాణను శత్రుదేశంగా చూస్తోందని, రాజకీయంగా పడనందునే మనల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కేంద్రం ఎంత ఇబ్బంది పెట్టినా దేశంలో అభివృద్ధిలో మనమే టాప్‌లో నిలిచామని చెప్పారు. కరోనాతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల నష్టం వచి్చందని, అయినా ఎక్కడ కూడా అభివృద్ధి ఆగలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కేటీఆర్‌ శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మిక మంత్రి మల్లారెడ్డిలతో కలిసి జాతీయ పంచాయతీ అవార్డులను ప్రదా­నం చేశారు.

దేశంలో 70 శాతం ప్ర­జ­లు పల్లెల్లోనే జీవిస్తున్నారని తెలంగాణలో పల్లె ప్రగతి కోసం రూ.14,232 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా గ్రామ పంచాయతీలకు రూ.1,300 కోట్లు ఈ రోజే విడుదల చేస్తున్నామన్నారు. ఇంకా రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందని గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారని, త్వరలోనే వాటినీ విడుదల చేస్తామని స్పష్టంచేశారు. మొత్తం 12,769 పంచాయతీలకు కొత్త కంప్యూటర్లు ఇస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో అవార్డులు సాధించిన పంచాయతీలకు రూ.10 లక్షలు, రాష్ట్రస్థాయిలోని వాటికి 20 లక్షలు, జాతీయస్థాయిలోని వాటికి రూ. 30 లక్షలు నజరానా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లికి సూచించారు. 
 
అభివృద్ధి ఆగొద్దు... 
పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు కష్టపడినందునే మనకు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని, ఈ అభివృద్ధి ఆగకుండా నిరంతరం కొనసాగాలని కేటీఆర్‌ చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయితీ ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని పల్లెలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. ఇప్పటివరకు మనకు 79 జాతీయ అవార్డులు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన నాడు మన తలసరి ఆదాయం రూ.1,24,000 ఉండగా, 2023 మార్చి నాటికి రూ.3,17,000గా ఉందని చెప్పారు. ఇది తాను చెబుతున్న మాట కాదని సర్వేల్లో వెల్లడైందని తెలిపారు. సీఎస్‌డీఎస్‌ అనే సంస్థ దేశంలోని 13 రాష్ట్రాల్లో సర్వే చేస్తే.. తలసరి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్‌ ఉందని, అవినీతిలో చివరిగా ఉందని తేలిందన్నారు. అనంతరం గ్రామ పంచాయితీల అభివృద్ధిపై రూపొందించిన బుక్‌లెట్‌ను కేటీఆర్‌ విడుదల చేశారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంపికైన పంచాయితీలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ ఆఫీసులో రూ. 75 కోట్లు ఇచ్చా: సుఖేశ్‌ చంద్రశేఖర్‌

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top