మునుగోడులో నైతిక గెలుపు బీజేపీదే: ఈటల  | Sakshi
Sakshi News home page

మునుగోడులో నైతిక గెలుపు బీజేపీదే: ఈటల 

Published Mon, Nov 21 2022 2:13 AM

MLA Etela Rajender Comments On Telangana CM KCR - Sakshi

కోదాడ అర్బన్‌: మునుగోడులో నైతిక గెలుపు బీజేపీదే అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముదిరాజ్‌ల కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆత్మగౌరవం, ఓటుకు విలువ కట్టిన నీచమైన సంస్కృతితో కేసీఆర్‌ ప్రభుత్వం పాలన చేస్తోందని మండిపడ్డారు.

వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉపఎన్నికలో పోలీసులను అడ్డుపెట్టుకుని చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఆయనకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని గుర్తించి పార్టీ కేడర్‌ను పోగొట్టుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీ అర్వింద్‌తో పాటు మునుగోడు అభ్యర్థి, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 4 కోట్ల ప్రజలను పాలించలేక విఫలమైన సీఎం.. బీఆర్‌ఎస్‌ పేరుతో 130 కోట్ల ప్రజలను ఏవిధంగా పరిపాలిస్తారని నిలదీశారు.   

Advertisement
 

తప్పక చదవండి

Advertisement