Mamata Banerjee: సీఎం కోసం పదవి త్యాగం చేసిన ఎమ్మెల్యే

Mamata Banerjee Likely To Contest From Bastion Bhabanipur - Sakshi

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించి మూడోసారి పగ్గాలు చేపట్టిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కషి చేసిన ఆమె నందిగ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా  పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. బీజేపీ పక్కా వ్యూహంతో ఆమె స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండడంతో మమత దానిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఓ స్పష్టత వచ్చిందని సమాచారం.

మమతా బెనర్జీ కోసం తన పదవిని వదులుకునేందుకు భవానీపూర్ ఎమ్మెల్యే ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సోవన్‌ దేవ్‌ ఛటోపాధ్యాయ్‌ శుక్రవారం రాజీనామా చేసినట్టు సమాచారం. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే భవానీపూర్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు మమతా బెనర్జీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు మమతా బెనర్జీ ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మమతా పోటీ చేసే స్థానంపై బీజేపీ ప్రధాన దృష్టి పెట్టింది. ఏం జరగనుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే భవానీపూర్‌ నుంచే మమత 2016లో గెలిచిన విషయం తెలిసిందే. ఆ స్థానం టీఎంసీకి కంచుకోట. దీంతో మమత గెలుపు సునాయాసమేనని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి.
చదవండి: కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top