ఇతర పార్టీ నాయకులను బీజేపీలోకి తీసుకురావాలి.. వేగం పెంచండి

Join more Leaders In Telangana BJP Directed Sunil Bansal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇతర పార్టీల నుంచి నేతల చేరికల పర్వంలో వేగం పెంచడంతోపాటు పార్టీని మరింత పటిష్టం చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ సంస్థాగత ఇన్‌చార్జీ సునీల్‌ బన్సల్‌ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. త్వరలోనే టీఆర్‌ఎస్, ఇతర పార్టీలకు చెందిన నలుగురు నేతలు బీజేపీలో చేరనున్నట్టు చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ వెల్లడించారని సమాచారం. త్వరలోనే మరికొందరు పార్టీలో చేరతారని, ఈ దిశలో పలువురు నాయకులతో చర్చలు వివిధస్థాయిల్లో ఉన్నాయని తెలియజేశారు.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను మరింత విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయడంతోపాటు కేంద్రం వివిధ వర్గాలు, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బన్సల్‌ సూచించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ భేటీలో చేరికల అంశంతోపాటు ప్రజాగోస–బీజేపీ భరోసా మోటార్‌ బైక్‌ ర్యాలీల నిర్వహణ, కేంద్రమంత్రులు చేపడుతున్న రెండోవిడత పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన తదితర విషయాలు చర్చకొచ్చాయి. కరీంనగర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీతోనూ విడిగా బన్సల్‌ సమావేశమయ్యారు. 

7 నుంచి హర్‌ఘర్‌ కమల్‌–హర్‌ఘర్‌ మోదీ 
మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని పార్టీ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని బన్సల్‌ ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వచ్చి మునుగోడు నుంచి పోటీ చేస్తున్నందున పార్టీ కమలం గుర్తు, అభ్యర్థి రెండింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ‘హర్‌ ఘర్‌ కమల్‌–హర్‌ ఘర్‌ మోదీ’పేరిట కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాష్ట్ర నేతలు తెలియజేశారు. దీని పరిధిలోని 7 నుంచి ప్రతీ శక్తి కేంద్రం (మూడు, నాలుగు పోలింగ్‌ బూత్‌లు) పరిధిలో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఒకేసారి నియోజకవర్గం మొత్తం కవర్‌ చేసేలా 95 ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మునుగోడులోని 189 గ్రామాల్లో బైక్‌యాత్రలు ఉంటాయని, ఇందులో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, మండల ఇన్‌చార్జీలు, ఇతర నేతలు పాల్గొంటారని స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. వెంటనే బూత్‌కమిటీల నియామకం పూర్తిచేయాలని బన్సల్‌ ఆదేశించారన్నారు. ఈ నెల 10న బూత్‌ కమిటీల సభ్యులతో పార్టీ అధ్యæక్షుడు బండి సంజయ్‌ సమావేశం కానున్నారు.
చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top