సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో టెన్షన్ వాతవరణం నెలకొంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు.
ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

మరోవైపు.. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పక్ష నేతల తీరుకు నిరసనగా సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరితే అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. మా ముట్టడి అడ్డుకున్నారు. నిన్న దేశానికి ఎమర్జెన్సీ కంటే చీకటి రోజు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం. కేవలం మైనార్టీ, కుటుంబ ప్రాతినిధ్యం కోసమే తప్ప సామాన్య మహిళ కోసం కాంగ్రెస్ మాట్లాడదు. కామన్ ఉమెన్ చట్ట సభలోకి రావొద్దని కాంగ్రెస్ తీరు ఉంది.
రిజర్వేషన్ రాబోతుందని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. హైబ్రిడ్, ఉత్తరాది, దక్షిణాది కేవలం మహిళ రిజర్వేషన్ వ్యతిరేకించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిది. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అంటూనే.. వ్యతిరేకంగా ఓట్లు వేశారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.


