టాలీవుడ్‌ హీరోలతో బీజేపీ అగ్ర నేతల భేటీలు.. అందుకేనా?

BJP Focus on South: JP Nadda Meets Telugu Hero Nithin in Hyderabad - Sakshi

దక్షిణాదిపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. సౌత్‌లో పార్టీని పటిష్టం చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిక కమలం పార్టీ మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలపడేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వివిధ రంగాలను చెందిన ప్రముఖులను తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. 


ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. ప్రముఖ టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. వీరి భేటీపై స్థానిక నాయకులకు కూడా సమాచారం లేదంటే బీజేపీ అగ్రనాయకత్వం ఎంత ప్లాన్డ్‌గా ముందుకెళుతుందో అర్థమవుతుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హీరో నితిన్‌పై సమావేశమయ్యారు. అయితే ఈ రెండు మర్యాదపూర్వక భేటీలని కమలనాథులు చెబుతున్నా.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలూ లేకపోలేదు. భారత మహిళల క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తోనూ నడ్డా సమావేశం కావడం ఈ వాదనలకు మరింత బలాన్నిస్తోంది. 


ఇంకాస్త ముందుకెళితే ప్రధాని నరేంద్ర మోదీని అంబేద్కర్‌తో పోల్చి ప్రశంసించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సీటు దక్కింది. కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ కూడా బీజేపీ ఆశీస్సులతో పెద్దల సభలో అడుగుపెట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమాజానికి అందిస్తున్న సేవలపై సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో బీజేపీ సర్కారు సత్కరించిన విషయం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రముఖ నటీమణులు విజయశాంతి, ఖుష్బూ ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు. (క్లిక్‌: హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్‌..)


తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ స్పీడ్‌ పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలంటే మునుగోడులో కచ్చితంగా గెలవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో కమలం పార్టీ అగ్రనాయకులు తెలంగాణకు వరుస కడుతున్నారు. శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలతో పాటు సినిమా ప్రముఖులతో భేటీలు నిర్వహిస్తూ ప్రజల దృష్టి తమపై పడేలా చేసుకుంటున్నారు. బీజేపీ ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో భవిష్యత్‌లో తెలుస్తుంది. (క్లిక్‌: కేసీఆర్‌ను ప్రజలే ఇంట్లో కూర్చోబెడతారు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top