మునుగోడులో బీజేపీ సభకు కేంద్రమంత్రి అమిత్‌షా

Amit shah to Attend BJP munugode rally - Sakshi

సత్తా చాటేలా జనసమీకరణపై బీజేపీ నాయకత్వం దృష్టి

నేడు చేరేది రాజగోపాల్‌రెడ్డి మాత్రమే.. మిగిలిన చేరికలన్నీ స్థానికంగానే..

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఆదివారం ‘మునుగోడు సమరభేరి’పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్వయంగా హాజరవుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ ఎండగట్టడంతోపాటు సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను అసత్య ప్రచారాలుగా తిప్పికొట్టాలని, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయాన్ని వివరించడంపై అమిత్‌ షా ప్రత్యేక దృష్టి సారించనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు భారీగా జనసమీకరణపై బీజేపీ నాయకత్వం దృష్టిపెట్టింది. పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరుతుండటంతో ఆయన సొంత నియోజకవర్గంలో ప్రాబల్యాన్ని చాటుకోవడంతోపాటు నియోజకవర్గంలో బీజేపీ ఏ విధంగా బలపడిందో తెలిపే విధంగా సభను నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకులు నిర్ణయించారు.

కేసీఆర్‌ విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చేలా...
దాదాపు గతేడాదిగా కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు ఉప్పు–నిప్పు మాదిరిగా మారడం... సమయం చిక్కినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ కేంద్రంపై ప్రత్యేకంగా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వాడుతున్న భాష, చేస్తున్న దాడిపై అమిత్‌ షా మునుగోడు బహిరంగ సభలో తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా శనివారం మునుగోడులో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌... కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎందుకు వాటా ఇవ్వడం లేదో స్పష్టం చేయాలని అమిత్‌ షాకు సవాల్‌ విసరడంతోపాటు మునుగోడులో బీజేపీకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోయినట్లే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నింటికి అమిత్‌ షా ఘాటుగా బదులిస్తారని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. 

చేరేది ఒక్కరే...
మునుగోడులో జరిగే బహిరంగ సభలో మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే బీజేపీలో చేరతారని, ఆ అంశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నందున ఇతర నేతల చేరికలు ఉండవని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సమావేశంలో ప్రదీప్‌రావు, రాజయ్య, మురళీయాదవ్‌ తదితరులు చేరనున్నారు.

అమిత్‌ షా షెడ్యూల్‌ ఇలా...
ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకోనున్న అమిత్‌ షా ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో మునుగోడు సభకు వెళ్లనున్నారు. అక్కడ దాదాపు గంటన్నరపాటు సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ముఖ్య నాయకులతో గంటకుపైగా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
చదవండి: బీజేపీకి ఓటేస్తే.. మోటార్లకు మీటర్లే 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top