నేటి నుంచి.. జగన్నాథ దర్శన యోజన ఆరంభం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి.. జగన్నాథ దర్శన యోజన ఆరంభం

Feb 13 2026 5:24 AM | Updated on Feb 13 2026 5:24 AM

నేటి నుంచి.. జగన్నాథ దర్శన యోజన ఆరంభం

నేటి నుంచి.. జగన్నాథ దర్శన యోజన ఆరంభం

● 5000 మంది వృద్ధులకు దర్శన భాగ్యం

భువనేశ్వర్‌: పూరిలో జగన్నాథుని దర్శనం కోసం ప్రభుత్వం జగన్నాథ దర్శన యోజనకు సంకల్పించింది. శుక్రవారం ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ నవరంగ్‌పూర్‌ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 వేల మంది వృద్ధులకు పూరీ శ్రీ మందిరంలో రత్న వేదికపై కొలువుదీరిన జగన్నాథున్ని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఉచిత రాకపోకలు, వసతి, భోజనం, సులభ దర్శనం, మహా ప్రసాదం వగైరా ఏర్పాట్లు ప్రభుత్వం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. తొలి దశలో 500 మంది భక్తులు పూరీ చేరుకుని జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. స్వామిని దర్శించుకున్న తర్వాత వారంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పూరీ సర్క్యూట్‌ హౌస్‌లో జిల్లా మేజిస్ట్రేట్‌ దివ్యజ్యోతి పరిడా అధ్యక్షతన గురువారం సన్నాహక సమావేశం జరిగింది. ఆధ్యాత్మిక, మతపరమైన పథకం కావున సేవా దృక్పథంతో పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో రాష్ట్రంలో 5 జిల్లాల నుంచి 500 మంది భక్తులు రానున్నారు. 13వ తేదీ సాయంత్రం దాదాపు 200 మంది చేరుతారు. మిగిలిన వారు 14వ తేదీ ఉదయం వస్తారని పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి సరోజ్‌ కుమార్‌ స్వంయి తెలిపారు. 60 నుంచి 75 సంవత్సరాల వృద్ధులు, వితంతువులు ఈ పథకంలో చేరవచ్చు. సంబంధిత జిల్లా యంత్రాంగం వారి జాబితాను తయారు చేసి పూరీ జిల్లా యంత్రాంగానికి అందజేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement