విందు భోజనాలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ● మరొకరికి గాయాలు
రాయగడ: విందు భఓజనాలకు వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలకు గురయ్యారు. ప్రమాదంలొ మృతి చెందిన వారిలో జిల్లాలోని పద్మపూర్ సమితి ఇందుపూర్ గ్రామానికి చెందిన నాయబ్ సర్పంచ్ కల్పన కై బర్త (55), ఆమె మనవరాలు పవిత్ర కై కబర్త (9 ఉన్నారు. గాయాలు తగిలిన వ్యక్తి శ్రీరాం కై బర్తగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సమీపంలో ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా.. గాయపడిన శ్రీరాంను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే .. బుధవారం శ్రీరాం, అతని భార్య కల్పన, మనవరాలు పవిత్రలు బైక్‌పై గజపతి జిల్లాలోని పర్లాకిమిడి విందు భోజనాలకు వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలో రాయగడ జిల్లా పద్మపూర్ సమితి పరిధిలోని కొరడ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వారిని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలొ కల్పన, పవిత్రలు తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలం వద్దే మృతి చెందగా గాయాలతో శ్రీరాం బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెల్పపారు.


