జాతీయ రహదారిపై కారు దగ్ధం
● ఒకరికి తీవ్రగాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు మంటల్లో దగ్ధమైంది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి సమీపంలో మంగళవారం జాతీయ రహదారి మీదుగా నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు స్థానికులు తెలిపారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించారు.


