రబీకి సరిపడా యూరియా నిల్వలు
వర్ని(మోస్రా): రబీ పంటకు సరిపడా జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి అన్నారు. సోమవారం యూరియా కోసం రైతులు రాస్తారోకో చేయడంతో స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి మంగళవారం మోస్రా మండలం గోవూరు సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, యూరియా నిల్వలను పరిశీలించారు. రైతులు ప్రభుత్వం సూచించిన యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలన్నారు. అక్రమ తరలింపును అడ్డుకోవడానికి ప్రభుత్వం కొత్త యాప్ విధానాన్ని తీసుకొచ్చిందని దీని ద్వారా రైతులకు సకాలంలో యూరియా అందుతుందని సూచించారు. మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్, సొసైటీ మాజీ చైర్మన్ పొట్టెంగారి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.


