ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్నలతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 34 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు.
సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలి
మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఆయా కార్యాలయాల పనితీరును, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రధానంగా పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించి, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. బాలికల విద్యాలయాలు, హాస్టళ్లలో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎక్కడ కూడా భోజనం కలుషితం కాకుండా చూడాలని, విద్యార్థుల ఆరోగ్యాల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేయాల ని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు.
ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి


