మలి యుద్ధం నేడే | West Bengal gears up for phase-2 polling | Sakshi
Sakshi News home page

మలి యుద్ధం నేడే

Apr 29 2026 3:45 AM | Updated on Apr 29 2026 3:55 AM

West Bengal gears up for phase-2 polling

పశ్చిమబెంగాల్‌ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

నేతల తలరాతల్ని నిర్ణయించనున్న 3 కోట్ల మంది ఓటర్లు

బరిలో మమతా బెనర్జీ, సువేందు అధికారి

142 స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

కోల్‌కతా: దశాబ్దన్నరకాలంగా పశ్చిమబెంగాల్‌ రాజకీయాలను శాసిస్తూ అధికారపీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దె దించే లక్ష్యంతో కమలనాథులు చేసిన విస్తృతప్రచారం, ప్రజాకర్షక పథకాలతో బెంగాళీలను మెప్పించానని చెబుతూ ప్రచారంచేసిన దీదీ మాటలు ఓట్లరూపంలో ఏమేరకు సఫలీకృతమవుతుందనేది నేటితో తేలిపోనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏప్రిల్‌ 23వ తేదీన జరిగిన తొలిదఫా పోలింగ్‌లో భారీ ఓటింగ్‌ నమోదుకావడంతో ఇది ప్రభుత్వవ్యతిరేక సరళి అని ఢంకా భజాయించిన బీజేపీ నేతలు అదేఊపుతో దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ విస్తృత ప్రచారంచేశారు.

అయితే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు కంచుకోటలైన కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బా బర్ధమాన్‌ జిల్లాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించాల్సి ఉంది.         నేడు పోలింగ్‌ జరగనున్న 142 స్థానాల్లో గతంలో టీఎంసీ హవా కొనసాగింది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్‌ఎఫ్‌ గెలిచాయి. గత ఐదేళ్లుగా ఈ 142 స్థానాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బాగా వేళ్లూనుకుంది. అయినాసరే ఈసారి కూడా ఉత్తర 24 పరగణాలు(33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు(31 సీట్లు), హౌరా(16), నదియా(17), హుగ్లీ(18), పూర్బా బర్ధమాన్‌(16), కోల్‌కతా(11 సీట్లు) ఈదఫా ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారాయి.

నేడు జరగబోయే ఎన్నికల్లో మొత్తంగా 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులుకాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మొత్తంగా 41,001 పోలింగ్‌స్టేషన్లలో పోలింగ్‌ జరగనుంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్‌ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తారు. బంగ్లాదేశ్‌ నుంచి వలసవచ్చిన మథువా హిందూ శరణార్థులు, పౌరసత్వ సవరణ చట్టం, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటం వంటివి బీజేపీకి ఈదఫా సానుకూల అంశాలుగా కన్పిస్తున్నాయి. 

పదేళ్లు పాలించిన 2021లో మమతను మళ్లీ బెంగాళీలు గెలిపించడం తమ పార్టీకి ఇంకా అత్యంత ప్రజాదరణ ఉందని టీఎంసీ ప్రకటించింది. అదేఊపుతో నాలుగోసారి నెగ్గుకురాగలమనే ధీమా పార్టీలో ఎక్కువైంది. అయితే కట్‌ మనీ, బొగ్గు కుంభకోణం, పథకాల్లో అవినీతి, టీఎంసీ గూండాయిజం, మయన్మార్, బంగ్లాదేశ్‌ నుంచి ముస్లింల చొరబాట్లు, ఖాళీ ప్రాంతాల ఆక్రమణల అంశాలు ఈసారి టీఎంసీకి వ్యతిరేకతను పెంచేలా కన్పిస్తున్నాయి. 

బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, జేపీ నడ్డా తదితరులు కీలక జిల్లాల్లో చాలా ప్రచారసభల్లో పాల్గొని భారీ స్థాయిలో హామీల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ సైతం టీఎంసీ తరఫున సుడిగాలి పర్యటనలు చేసి మరోమారు తన పార్టీని ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను వేడుకున్నారు. ఎక్కడా అవాంఛనీయఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నడూలేనంతటి భారీ సంఖ్యలో కేంద్రరిజర్వ్‌ బలగాలను పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో మోహరించింది.

తొలి దశ ఎన్నికల్లో 93.19 శాతం పోలింగ్‌ నమోదవడంతో రెండోది, చివరిదైన ఈ దఫాలో ఎంతటి పోలింగ్‌ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కంచుకోట భవానీపూర్‌ నుంచి మమతాబెనర్జీ పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేంధు అధికారి నిలబడ్డారు. బెంగాళీలు, గుజరాతీలు, మార్వాడీలు, జైనులు, సిక్కులు, ముస్లింలు, బిహార్, జార్ఖండ్‌ శరణార్థులతో నిండిన భవానీపూర్‌ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది.

Advertisement
 
Advertisement
Advertisement