మరాఠీ బోర్డులపై మొదలైన వివాదం

Traders Against Marathi Signboards Mandatory Mumbai - Sakshi

మరాఠీ భాషలోనే రాయాలని ఆదేశించిన మహరాష్ట్ర సర్కార్‌ 

అన్ని వర్గాల నుంచి అభినందనలు..

ఈ ఘనత మాదే అంటున్న ఎమ్మెన్నెస్‌ 

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్న వ్యాపార సంఘటనలు 

సాక్షి, ముంబై: దుకాణాల బోర్డులు మరాఠీలోనే రాయాలని మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం రాజుకునే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవైపు ఈ ఘనత తమదేనంటూ, ఇతరులు దక్కించుకునే ప్రయత్నం చేయవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) స్పష్టం చేసింది. మరోపక్క పెద్ద అక్షరాలతో మరాఠీలో రాయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపార సంఘటనలు వ్యతిరేకిస్తున్నాయి.

దీంతో ఇటు వ్యాపార పరంగా అటు రాజకీయంగా మరాఠీ బోర్డుల వివాదం రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డులన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో మరాఠీలో రాయాలని, ఆ తర్వాత వాటికింద ఇతర భాషల్లో లేదా మీకు నచ్చిన భాషల్లో రాయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తేమి కాదని, గతంలోనే తమ పార్టీ మరాఠీ బోర్డుల అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.

అంతటితో ఊరుకోకుండా 2008, 2009లో ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలు ఇతర భాషల్లో రాసిన బోర్డులపై నల్లరంగు లేదా తారు పూసి ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలో భాగంగా ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లి శిక్ష అనుభవించారు. దీంతో దిగివచ్చిన అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. కానీ, వంద శాతం అమలుకు మాత్రం నోచుకోలేకపోయింది. ఇప్పుడు అదే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి కీర్తి దక్కించుకునే ప్రయత్నం మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం చేస్తోందని రాజ్‌ ఠాక్రే ఆరోపించారు.

మరాఠీ బోర్డుల ఘనత కేవలం తమదేనని, ఇతరులు దీన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి రాసిన లేఖలో హెచ్చరించారు. ఇతరులు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తే తమ కార్యకర్తలు మళ్లీ రోడ్డుపైకి వస్తారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న మరాఠీ భాషలోనే బోర్డుల నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. బీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆఘాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది.  

వ్యాపార సంఘటనల వ్యతిరేకత... 
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నేతృత్వంలోని మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపార సంఘటనలు వ్యతిరేకిస్తున్నాయి. దుకాణాల బోర్డులు మరాఠీలో రాయాలనే అంశాన్ని తము వ్యతిరేకించడం లేదని, మరాఠీ అక్షరాలు పెద్దగా ఉండాలని, దాని కింద ఇతర భాషల్లో రాయాలని ఆదేశాలు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఫెడెరేషన్‌ ఆఫ్‌ రిటైల్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విరేన్‌ షా పేర్కొన్నారు. ముంబైలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలకు చెందిన ప్రజలుంటారు. ముఖ్యంగా కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు షాపులున్న ప్రాంతాల్లో ఎక్కువశాతం ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలుంటారో ఆ భాషలో బోర్డులు రాయాల్సి ఉంటుంది.

పెద్ద అక్షరాలతో పైన మరాఠీలో రాసి, చిన్న అక్షరాలతో కింద రాస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపారులంటున్నారు. మరాఠీ భాష అంటే తమకు అభిమానమే, కానీ, మరాఠీ అక్షరాలకంటే ఇతర భాషల అక్షరాలు చిన్నగా ఉండాలనే నియమాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తాజాగా అమలుచేసిన ఆంక్షల ప్రభావం వ్యాపార లావాదేవీలపై తీవ్రంగా చూపుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దుకాణాల బోర్డు మార్చాలంటే కనీసం రూ.20–30 వేల వరకు ఖర్చవుతుంది. దీంతో ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే వరకు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యాపార సంఘటనలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

బ్యాంకులు, రైల్వే, ఎయిర్‌ పోర్టు, బీమా సంస్థల సంగతేంటి? 
గత బుధవారం జరిగిన మంత్రి మండలిలో దుకాణాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డు మరాఠీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, బ్యాంకులు, ఎయిర్‌ పోర్టు, రైల్వే, గ్యాస్, పెట్రోలియం, పోస్టల్, మెట్రో, మోనో, టెలిఫోన్, బీమా కంపెనీల బోర్డుల గురించి వెల్లడించలేదు. వీటి సంగతేంటనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలున్నాయి.

నియమాల ప్రకారం కేంద్రం, కేంద్రానికి అనుబంధంగా ఉన్న సంస్థల బోర్డులు తొలుత హిందీలో, ఆ తరువాత స్థానిక భాషను బట్టి ఆ భాషలో రాయాల్సి ఉంటుంది. కానీ, మహరాష్ట్రలో మరాఠీ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని దుకాణాలు, వ్యాపారం, వాణిజ్య సంస్థల బోర్డులన్నీ మరాఠీలో రాయాలని మొన్నటి వరకు ఎమ్మెన్నెస్, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తునేది వేచిచూడాలి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top