బడా కంపెనీల కోసమే బిల్లులు

Tpcc Chief Uttam Kumar Reddy Slams Narendra Modi Government - Sakshi

కనీస మద్దతు ధర, రైతు ఆదాయం పెంపుపై స్పష్టత లేదు 

ప్రైవేటు కంపెనీలు అక్రమ నిల్వలకు పాల్పడతాయి 

25న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులు తెచ్చిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. వీటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీ రేవంత్‌రెడ్డితో కలసి సోమవారం విజయ్‌చౌక్‌ వద్ద విలేకరులతో ఉత్తమ్‌ మాట్లాడారు. ‘విపక్షాల సవరణ ప్రతిపాదనలు కూడా పట్టించుకోకుండా కొత్త వ్యవసాయ బిల్లులను మోదీ ప్రభుత్వం ఆమోదింపచేసుకుంది. వీటికి పేర్లే తప్పుగా పెట్టారు. ఏపీఎంసీ మార్కెట్‌ మూసివేత బిల్లు, కాంట్రాక్టు ఫార్మింగ్‌ ప్రోత్సాహక బిల్లు, ఆహార ఉత్పత్తుల కార్పొరేట్‌ అక్రమ నిల్వల బిల్లు అని పేర్లు పెడితే సబబుగా ఉండేది. అదానీ, అంబానీ, అమెజాన్, వాల్‌మార్ట్‌ వంటి పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చేలా, రైతులకు నష్టం కలిగించేలా కొత్త బిల్లులున్నాయి’ అని ఆయన అన్నారు.  

కాంట్రాక్టు సేద్యం ప్రోత్సహించేలా.. 
‘మొదటి బిల్లు.. కంపెనీల ద్వారా కాంట్రాక్టు సేద్యం ప్రోత్సహించేలా ఉంది. æఇది కంపెనీలకు రైతులతో కాంట్రాక్టు కుదుర్చుకునే స్వేచ్ఛ ఇచ్చింది. కానీ రైతులకు ఎలాంటి రక్షణా కల్పించలేదు. ధర హామీ ఇవ్వలేదు. కనీస మద్దతు ధర ఊసేలేదు. బిల్లు ప్రకారం కంపెనీలు రైతులతో లిఖిత పూర్వకంగా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో కంపెనీ కాంట్రాక్టును ఉల్లంఘించినా రైతు ఏమీ చేయలేడు. ఇక నిత్యావసర సరుకుల సవరణ చట్టం బిల్లు లక్ష్యం రైతుల ఆదాయం పెంచడమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుత చట్టాల మేరకు సరుకుల నిల్వపై రైతులకు మాత్రమే అధికారం ఉండేది. కానీ కొత్త బిల్లు.. ప్రైవేటు కంపెనీలు నిత్యావసర సరుకులు కొనడం, నిల్వ చేసుకోవడంపై ఉండే ఆంక్షలు తొలగిస్తుంది. అంటే అవి అక్రమంగా నిల్వచేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వ్యవసాయ మార్కె ట్‌ రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని రాష్ట్రాల అధికారాన్ని హరిస్తోంది. కొత్త చట్టంతో మార్కెట్‌ యార్డులో కొనుగోలుచేసే వ్యవస్థ కుప్పకూలుతుంది’ అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ మూడు డిమాండ్లు
► మార్కెట్‌ యార్డుల లోపల, వెలుపలా అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల నియంత్రణ ఉండాలి.  
► కొనుగోలుదారులు తమ పేర్లు రిజిస్టర్‌ చేయించుకోవాలి. వారి లావాదేవీలు నియంత్రణలకు లోబడి ఉండాలి. 
► మార్కెట్‌ యార్డు లోపల అమ్మినా, బయట అమ్మినా రైతుకు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ లభించాలి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top