ఎన్డీయే పక్షం భేటీలో సమ్రాట్ చౌదరిని అభినందిస్తున్న నితీశ్‌కుమార్
నేడు ప్రమాణం
నితీశ్ రాజీనామా
పట్నా: బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి(57) బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీయూ చీఫ్, సీఎంగా రెండు దశాబ్దాలపాటు కొనసాగిన నితీశ్ కుమార్(75) మంగళవారం పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, తదితరుల సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభా పక్షం ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని తమ నేతగా ఎన్నుకుంది. ఆపై, ఎన్డీఏ పక్షం ఎమ్మెల్యేల భేటీలో చౌదరిని ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. బిహార్ తదుపరి సీఎంగా సమ్రాట్ చౌదరి బుధవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రకటించారు.
ఆయనతోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేసే అవకాశముందన్నారు. కాగా, స్వయంగా నితీశే తనను శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించారని అనంతరం చౌదరి మీడియాకు తెలిపారు. సమ్రాట్ చౌదరికి బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు గత నెలలో నితీశ్ ప్రకటించినప్పటి నుంచి తదుపరి సీఎంగా సమ్రాట్ చౌదరి పేరే ప్రముఖంగా వినిపించింది.
పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఆయనకు మద్దతు ప్రకటించారు. మంగళవారం జరిగిన కీలక భేటీలో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా, సీనియర్ నేతలు మంగళ్ పాండే, దిలీప్ జైశ్వాల్, రేణు దేవి సీఎల్పీ నేతగా సమ్రాట్ పేరును ప్రతిపాదించగా కేంద్ర పరిశీలకుడిగా హాజరైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా సమ్రాట్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.


