సెప్టెంబర్‌15 నుంచి వర్షాకాల సమావేశాలు 

Parliament Monsoon Meeting Starts From September 15th 2020 - Sakshi

పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫారసు 

త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్న ప్రభుత్వం 

షిఫ్టుల వారీగా జరగనున్న లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి అక్టోబర్‌ 1 వరకు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి సెలవులు, వారాంతపు విరామం లేకుండా మొత్తం 18 సిట్టింగ్‌లుండే ఈ సమావేశాల తేదీలు, ఇతర వివరాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మొదటిసారిగా జరగనున్న ఈ సమావేశాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భౌతిక దూరం నిబంధనల మేరకు సభ్యులు కూర్చునేందుకు వీలుగా లోక్‌సభ, రాజ్యసభ చాంబర్లతోపాటు గ్యాలరీలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు ఉభయసభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లో కూర్చుంటారని రాజ్యసభ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి.

రాజ్యసభకు చెందిన 60 మంది సభ్యులు చాంబర్‌లోనూ, 51 మంది గ్యాలరీల్లోనూ, మిగతా 152 మంది లోక్‌సభ చాంబర్‌లోనూ ఆసీనులవుతారు. భారత పార్లమెంట్‌ చరిత్రలో 1952 తర్వాత ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఇదే ప్రథమం. లోక్‌సభ సెక్రటేరియట్‌ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. గ్యాలరీల్లో కూర్చునే సభ్యులు కూడా సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా హెడ్‌ఫోన్ల వంటి వాటితోపాటు భారీ డిస్‌ప్లే తెరలను ఏర్పాటు చేశారు. అల్ట్రావయెలెట్‌ వైరస్‌ నాశనులను, ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుల్‌ వ్యవస్థను, పాలీకార్బొనేట్‌ తెరలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోవిడ్‌–19 కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఉభయసభలను ఉదయం, సాయంత్రం  షిఫ్టుల వారీగా నిర్వహిస్తారు. చివరిసారిగా పార్లమెంట్‌ సమావేశాలు మార్చి 23వ తేదీన కోవిడ్‌ కారణంగా వాయిదాపడ్డాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top