జాబ్‌ నుంచి సాయిబాబా తొలగింపు

Jailed Scholar GN Saibaba Removed From His Asst Prof Post at Delhi University - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్‌ ఆనంద్‌ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్‌ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్‌ రాకేశ్‌ కుమార్‌ గుప్తా పేర్కొన్నారు.

ఇంగ్లిష్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్‌ రావు అలియాస్‌ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్‌) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్‌ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్‌ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.  

గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు
అయితే సాయిబాబా అరెస్ట్‌ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్‌ బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని  ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top