అమెరికా ఎన్నికల ఫలితం: భారత్‌ కీలక వ్యాఖ్యలు!

Harsh Vardhan Shringla Says US Election 2020 Outcome Unlikely to Impact Ties - Sakshi

ఎన్నికల ఫలితం పెద్దగా ప్రభావం చూపదు

ఉద్రిక్తతలకు చైనా దుందుడకు వైఖరే కారణం

క్వాడ్‌ దేశాలు పరస్పర సహాయసహకారాలతో ముందుకు సాగుతాయి

న్యూఢిల్లీ: భారత్‌తో అగ్రరాజ్యానికి ఉన్న సంబంధాలను అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం పెద్దగా ప్రభావితం చేయదని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా అన్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌లలో ఎవరు గెలిచినా ద్వైపాక్షిక బంధం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీకి ట్రంప్‌తో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ ప్రత్యేక అనుబంధం ఉందని, పార్టీలకు అతీతంగా దేశ ప్రయోజనాల కోసం దౌత్య విధానాలు రూపుదిద్దుకుంటాయని చెప్పుకొచ్చారు. మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశలు గల్లంతు చేస్తూ జో బైడెన్‌ దూసుకుపోతున్నారు. అయితే పెద్దరాష్ట్రాల్లో ఆధిక్యం కనబరుస్తున్న ట్రంప్‌.. విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాతో మన బంధం పరస్పర మద్దతు, సహాయసహకారాలపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌(అమెరికా చట్టసభలు)లోనూ, ప్రజా వ్యవహరాలను పరిశీలించినట్లయితే ఈ విషయం అర్థమవుతుంది. కాలక్రమంలో ఎన్నెన్నో పరీక్షలకు తట్టుకుని ద్వైపాక్షిక బంధం నేటికీ కొనసాగుతోంది. సమగ్రమైన, బహుముఖ దౌత్య విధానాలతో ముందుకు సాగుతున్నాం. విలువలు, విధానాల్లో మాత్రమే కాదు వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలోనూ పరస్పర అవగాహనతో సంబంధాలను మెరుగుపరచుకుంటున్నాం’’అని ఆయన చెప్పుకొచ్చారు. (చదవండి: హోరాహోరీగా కొనసాగుతోన్న పోటీ)

చైనా దుందుడుకు వైఖరి వల్లే
ఇక సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల గురించి విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘అక్కడి పరిస్థితులు నిజంగానే కాస్త ఉద్రిక్తంగా ఉన్నాయి. అవి ఇరు దేశాల మధ్య ఉన్న బంధంపై ప్రభావం చూపుతాయి. అయితే దీనికంతటికి చైనా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, యథాతథ స్థితిని మార్చేందుకు చేసిన దుందుడుకు ప్రయత్నాలే కారణం’’ అని శ్రింగ్లా బదులిచ్చిరు. అదే విధంగా చైనా, భారత భూభాగాన్ని ఆక్రమించిందా అన్న ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘‘సరిహద్దుల్లో బలగాలు ప్రస్తుత స్థానాల నుంచి ముందుకు రావడం వంటి కవ్వింపు చర్యలు దౌత్య సంబంధాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. 

చైనా ఆర్మీ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నాం. ప్రాంతీయ సమగ్రత, మన సార్వభౌమత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం’’అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టే లక్ష్యంతో ఏర్పాటైన క్వాడ్‌ దేశాల(క్వాడ్రిలాటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌- భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌) విధానం గురించి మాట్లాడుతూ.. పరస్పరం సహకరించుకుంటూ, స్వేచ్చాయుత వాతావరణం, సుస్థిరత నెలకొల్పడమే ధ్యేయంగా నాలుగు దేశాలు ముందుకు సాగుతున్నట్లు శ్రింగ్లా వెల్లడించారు.(చదవండి: అవన్నీ అబద్ధాలు.. కట్టుకథలు: చైనా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top