
న్యూఢిల్లీ: గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని ప్రధాని మోదీ అభిలషించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు బుద్ధుడి బోధనలు చక్కని పరిష్కారాలు చూపగలవని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ సెషన్‌లో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ‘ యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత అతివాదం, వాతావరణ మార్పులు.. ఇలా ఎన్నో అంతర్జాతీయ సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి.
వీటికి గౌతముని సద్గుణ బోధనలు పరిష్కార మార్గాలు చూపుతాయి’ అని అన్నారు. పర్యావరణ మార్పు సమస్యకు సంపన్న దేశాలే కారణమంటూ విమర్శించారు. బుద్ధుడు చూపిన మార్గం భవిష్యత్, సుస్థిర పథం. గతంలోనే ఆయన చూపిన మార్గంలో వెళ్లిఉంటే ఇప్పుడీ ప్రపంచానికి ప్రకృతి విపత్తులు దాపురించేవే కాదు. సంకుచిత భావన నుంచి విస్తృత సమ్మిళిత ప్రపంచ భావన దిశగా మళ్లడం అత్యావశ్యకం.
బుద్ధుని నుంచే భారత్ స్ఫూర్తి
గౌతముడి ఉపదేశాలను భారత్ ఆచరిస్తోంది. పెను భూకంపంతో కుప్పకూలిన తుర్కియేసహా పలు దేశాలకు ఆపన్నహస్తం అందించింది. బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించడమంటే సమస్యల నుంచి సమాధానం వైపునకు పయనించడమే’ అని అన్నారు. సదస్సుకు 30 దేశాల నుంచి బౌద్ధ సన్యాసులు తదితరులు వచ్చారు.