ఎయిర్‌ ఇండియా వన్‌ వచ్చేసింది

First custom-made VVIP aircraft Boeing 777 Air India One - Sakshi

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణం కోసం..

విమానంలో అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్‌ ఇండియా వన్‌ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్‌–777 విమానం అమెరికాలోని టెక్సాస్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విమానం చేరుకున్నట్టు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు. వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్‌ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్‌లో బోయింగ్‌ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. రెండో విమానం మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విమానంపై భారత్‌ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. గత జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఎయిర్‌ఇండియా వన్‌ కాల్‌ సైన్‌తో బోయింగ్‌ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు.

ప్రత్యేకతలివీ
► ఎయిర్‌ ఇండియా వన్‌ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రేర్డ్‌ కౌంటర్‌మెజర్స్‌ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌ (ఎస్‌పీఎస్‌)ను అమర్చారు.  
► అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్‌ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్‌ ఫ్రీక్వెన్సీని జామ్‌ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు.  
► అమెరికా నుంచి భారత్‌ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఇంధనం నింపడానికి కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది. కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
► విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్‌ కమాండ్‌ సెంటర్‌ మాదిరి పనిచేస్తుంది.    
► ఈ విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది.  
► ఈ విమానాలను ఎయిర్‌ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు.   
► ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top