Cyclone Tauktae: అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే | Sakshi
Sakshi News home page

Cyclone Tauktae: అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే

Published Mon, May 17 2021 5:26 AM

Dangerous Cyclone Tauktae Grows Stronger Along India Coastal areas - Sakshi

న్యూఢిల్లీ/బెంగళూరు/అహ్మదాబాద్‌: కరోనా విజృంభనకు తోడు తుపాను ‘తౌక్టే’ తీర రాష్ట్రాలను వణికిస్తోంది. తౌక్టే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. మంగళవారం ఉదయం తీరం దాటనున్న గుజరాత్‌ తీర ప్రాంతంలో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ను జారీ చేసింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్రమై తుపానుగా మారిన విషయం తెలిసిందే. తౌక్టే ఉత్తర– వాయవ్య దిశగా గుజరాత్‌ తీరం వైపు దూసుకు వస్తోందని, సోమవారం రాత్రి గుజరాత్‌ తీరానికి చేరువవుతుందని వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందరు– మహువ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది.

తీరం దాటే సమయంలో అత్యంత తీవ్రమైన వేగంతో.. గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ మహారాష్ట్ర, గోవా, సమీప కర్ణాటక తీర ప్రాంతాల్లోనూ ఈ గాలుల వేగం గంటకు 140– 150 కిమీల వరకు ఉంటుందని తెలిపింది. డయ్యూడామన్‌ తీర ప్రాంతానికి కూడా ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసినట్లు తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర తీరంలో సోమవారం నుంచే గంటకు 65 నుంచి 85 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈదురుగాలులకు తోడు ఈ అన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిం చింది. దక్షిణ గుజరాత్‌ తీరంలోని పోరుబందర్, జునాగఢ్, గిర్‌ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో, డయ్యూడామన్‌లో గాలుల వేగం మంగళవారం నాటికి తీవ్రమవుతుందని, గంటకు 150 నుంచి 175 కిమీల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

అలాగే ద్వారక, జామ్‌నగర్, భావ్‌నగర్‌ జిల్లాల్లో మే 18 ఉదయం నుంచి గంటకు 150 నుంచి 165 కిమీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో జునాగఢ్‌లో అలలు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశముందని తెలిపింది. జునాగఢ్, భావ్‌నగర్‌ తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరగవచ్చని పేర్కొంది. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సమాచార, విద్యుత్‌ వ్యవస్థలు నిలిచిపోవచ్చని, రైల్వే సేవలకు అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. గుజరాత్‌ తీరంలో లోతట్టు ప్రాంతాల నుంచి లక్షన్నర మందిని సహా య కేంద్రాలకు తరలించారు. రాష్ట్రానికి చెందిన ఇతర సహాయ బృందాలతో కలిసి ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 54 బృం దాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటు న్నా యి. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవ ద్దని కో రామని, ఇప్పటికే వేటకు వెళ్లిన 149 బోట్లలో 107 తిరిగివచ్చాయని సీఎం విజయ్‌ రూపానీ చెప్పారు.

కర్ణాటకలో నలుగురు మృతి
తౌక్టే తుపాను కర్ణాటక తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. తీర ప్రాంత జిల్లాల్లోని 98 గ్రామాల్లో ఈ ప్రభావం భారీగా కనిపిస్తోంది. తుపాను కారణంగా ఇక్కడ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, కొడగు, హసన్, శివమొగ్గ, చిక్‌మగలూర్‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో తుపాను ప్రభావం కనిపించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో ఇళ్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో పాటు పండ్ల తోటలకు అపారనష్టం వాటిల్లిందని, రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రధానంగా ఉడిపి జిల్లాలో 23 గ్రామాలు తుపాను బారినపడ్డాయని తెలిపారు.

పడవను తీరంలో నిలుపుతున్న వ్యక్తిని మరో బోటు ఢీ కొట్టడంతో ఒకరు(ఉత్తర కన్నడ జిల్లా), విద్యుత్‌ షాక్‌తో ఒకరు(ఉడిపి), ఇల్లు కూలి ఒకరు (చిక్‌మగళూరు), పిడుగుపాటుకు మరొకరు (శివమొగ్గ) చనిపోయారని వెల్లడించారు. ఇప్పటివరకు తీర ప్రాంతాల్లో 11 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తీర మల్నాడు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయని, ఈ జిల్లాల్లోని 313 కేంద్రాల్లో సుమారు 64.5 మి.మీ.ల కన్నా ఎక్కువ వర్షపాతం, 15 కేంద్రాల్లో 200 మి.మీ.ల వర్షపాతం నమోదైందన్నారు. ఉడిపి జిల్లాలోని కుందపుర తాలూకా, నాడా స్టేషన్‌ వద్ద అత్యధికంగా 385 మి.మీ.ల వర్షపాతం నమోదైంద ని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిని, సహాయ చర్యలను సీఎం యెడియూరప్ప సమీక్షించారు.  

కేరళలో ప్రమాదకర స్థాయికి డ్యామ్‌లు
కేరళలోని తీర ప్రాంతంలోని పలు డ్యాముల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి పెరిగాయి. ఎర్నాకులం, ఇదుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలను సహాయ కేంద్రాలకు తరలించారు. ఎర్నాకులం జిల్లాలోని చెల్లానం తీర గ్రామంపై పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడటంతో నౌకాదళం ఆ గ్రామస్తులను కాపాడి, సహాయ కేంద్రాలకు తరలించింది.

కొంకణ్, ముంబైల్లో నేడు భారీ వర్షాలు
మహారాష్ట్రలోని ఉత్తర కొంకణ్, ముంబై, థానె, పాల్ఘార్‌ల్లో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.  

గోవాలో..
ఆదివారం ఉదయం నుంచే ఈదురుగాలులు, వర్షా లు గోవాలోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ అలలు తీర ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చాయి. ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. చెట్టు కూలడంతో ఒక బాలిక, బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ స్తంభం కూలిపడడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.  ఈదురుగాలుల ధాటికి పలు 33 కేవీ ఫీడర్లు, మహారాష్ట్ర నుంచి గోవాకు విద్యుత్‌ను సరఫరా చేసే పలు 220 కేవీ లైన్లు ధ్వంసమయ్యాయి.  

పీఎం సమీక్ష
రాష్ట్రాల్లో తుపాను సహాయ కార్యక్రమాల సంసిద్ధతను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సమీక్షించారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్‌ ఆసుపత్రులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, వాటికి అన్ని సదుపాయాలు అందేలా చూడాలని, టీకా కార్యక్రమానికి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. తీరప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని, కోవిడ్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో జరిపిన వర్చువల్‌ సమావేశంలో తెలిపారు.

బోటు మునక.. ఇద్దరు మృతి
మంగళూరు:
కర్ణాటకలోని మంగళూరు తీరంలో బోటు మునిగిన దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా, ముగ్గురు గల్లంతయ్యారు. మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎమ్మార్పీ ఎల్‌)కు చెందిన అలయెన్స్‌ అనే పడవ శనివారం సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో బోటులోని 8 మంది సిబ్బందికిగాను ఇద్దరు చనిపోగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారనీ, మిగతా ముగ్గురి జాడ తెలియాల్సి ఉందని ఎమ్మార్పీఎల్‌ ఆదివారం వెల్లడించింది.

‘తౌక్టే’ అంటే...
తీవ్రమైన తుపానుగా మారుతున్న ‘తౌక్టే’ అంటే అర్థమేమిటో తెలుసా. తౌక్టే అంటే బర్మీస్‌ భాషలో గెకో... ‘గట్టిగా అరిచే బల్లి’. ప్రస్తుతం తుపాన్‌కు మయన్మార్‌ దేశం పెట్టిన పేరిది. మయన్మార్‌ ఎందుకు పెట్టింది అంటే... ఈసారి వాళ్ల వంతు కాబట్టి. వరల్డ్‌ మెట్రోలాజికల్‌ ఆర్గనైజేషన్‌/ యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఏషియా అండ్‌ ది పసిఫిక్‌ ప్యానెల్‌ తుపాన్లకు పేర్లు పెడుతుంది. ఈ ప్యానెల్‌లోని 13 దేశాలు ఏషియా– పసిఫిక్‌ ప్రాంతంలో వచ్చే తుపాన్లకు వంతులవారీగా పేర్లు పెడుతుంటాయి. దీంట్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌ దేశాలున్నాయి.

ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి. ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల నుంచి తుపాన్లకు రొటేషన్‌ పద్ధతిలో ఆయా దేశాల వంతు వచ్చినపుడు.. వారు సూచించిన పేర్ల నుంచి ఒకటి వాడుతారు. కిందటి ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు ‘నిసర్గ’గా బంగ్లాదేశ్‌ నామకరణం చేసింది. వాతావరణ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలు, సాధారణ ప్రజానీకం ప్రతి తుపాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ పేరు ఉపకరిస్తుంది.  
కన్యాకుమారి తీరంలో అల్లకల్లోలంగా మారిన సముద్రం 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement