ఆట మొదలైంది..!
● పాచికలతో అధికార పార్టీ వ్యూహాలు
● ఎత్తుకు పైఎత్తులో ప్రతిపక్షాలు
● ఎవరి మధ్య పోటీ.. అభ్యర్థులపై సర్వేలు
● రంగంలోకి దిగిన రేవంత్ సైన్యం
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్నందున అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తూ అభ్యర్థుల కదలికలు, ప్రచారంపై ఓ బృందం కన్నేసినట్లు కనిపిస్తోంది. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడంలో అధికార పార్టీకి కత్తిమీద సాముగా మారింది. నామినేషన్ల మొదలు ఉపసంహరణ సమయం ముగిసే వరకు జాగ్రత్తపడినా అధికార పార్టీకి అసంతృప్తులు తలనొప్పిగా మారారు. వార్డులను ఏకగ్రీవం చేయాలనుకున్నా సాధ్యపడకపోవడంతో కొత్త వ్యూహాలకు తెర తీసింది. సీఎం ఇలాఖాలోని కోస్గిలోని 4వ వార్డుకు చెందిన భానునాయక్‌ను ఏకగ్రీవం చేయాలని మొదటి నుంచి వ్యూహాలు చేసినప్పటికీ.. అశావహులైన శ్రీనివాస్, రామునాయక్‌ను ప్రతిపక్షాలైనా బీఆర్‌ఎస్, బీజేపీ రంగంలోకి దింపి బీ ఫారాలు సైతం ఇచ్చాయి. ఆ ఇద్దర్ని ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ కండువాలు కప్పడంతో వాతావరణం వేడెక్కినట్లయింది.
పేటలో స్వతంత్ర అభ్యర్థి సరెండర్..
నారాయణపేటలో కాంగ్రెస్‌పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి సరిత భట్టడ్‌కు చెందిన జువెల్లరీ దుకాణంలో సెల్స్ మేనేజర్ బుగ్గప్ప 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అతడిని తప్పిస్తేనే ఆ వార్డులో కాంగ్రెస్‌పార్టీకి ఇబ్బందులు ఉండవని భావించి శుక్రవారం సరెండర్ చేసుకుంది. తాను స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పడం చూస్తుంటే అధికార పార్టీ ఎన్నికల వ్యూహం ఏ తరహాలో కొనసాగుతుందో అర్థమవుతోంది.
రంగంలోకి రేవంత్ సైన్యం..
జిల్లాలోని అన్ని పురపాలికల్లో అధికార పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సైన్యం రంగంలోకి దిగింది. మున్సిపాలిటీలు హస్తగతం కాకపోతే జిల్లాలో సీఎం ఓడినట్లేనని ముందస్తుగా భావించిన అధికార పార్టీ ప్రతిపక్షాల పాచికలను పసిగడుతూ వ్యూహరచన చేస్తున్నాయి.
ఎవరి మధ్య పోటీ..
అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల గెలుపోటములపై ఎవరికి వారే సర్వేలో నిమగ్నమయ్యారు. ఓ వైపు ప్రచారాన్ని హోరెత్తిస్తునే మరోవైపు తమ అనుచరులతో ప్రజల నాడి పట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సిట్టింగ్ కౌన్సిలర్లు.. కొత్తగా పోటీచేస్తున్న వారు. ఏయే పార్టీ అభ్యర్థులు ఎంత మంది గెలుస్తారనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలను అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం తమ అధినేతలకు పంపిస్తున్నారు.
మక్తల్, పేటలో బీజేపీకి పట్టు..
గత మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో బీజేపీకి బడా లీడర్లు, క్యాడర్ ఉండటంతో కై వసం చేసుకున్నట్లు అధికార పార్టీ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 2020లో నారాయణపేటలో బీఆర్‌ఎస్, మక్తల్‌లో బీజేపీ, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ జెండా ఎగిరింది. అయితే నారాయణపేట పుర చైర్‌పర్సన్ గందె అనసూయ తన అనుచరులతో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూటికి చే రింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్వేలో మక్తల్, నారాయణపేటలో బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలువబోతున్నట్లు తేలనుండటంతో జీర్ణి ంచుకోలేక చేయి దాటకముందే పసిగట్టి ప్రతిపక్షాల ను సెల్ఫ్‌అవుట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మద్దూర్‌లోబీఆర్‌ఎస్ గట్టి పోటీ..
కోస్గి పురపాలికలో హస్తం హవా కొనసాగుతుండగా.. మక్తల్, నారాయణపేటలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మద్దూర్‌లో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో అధికారపార్టీ కంటే ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ సైన్యం కారుకు బ్రేకులేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. నాలుగు మున్సిపాలిటీలు హస్తగతం అవుతాయా.. లేదో వేచి చూడాల్సిందే మరి.


