ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
● అధికారులు పనితీరు మార్చుకోవాలి
● కలెక్టర్ సిక్తాపట్నాయక్
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా వెనుకబడి ఉండటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దామరగిద్ద మండలం పూర్తిగా వెనుకబడి ఉండటంతో ఎంపీడీఓను సంజాయిషీ కోరారు. పద్ధతి మార్చుకోవాలని, పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయిలో ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకంలో కూలీలకు వంద రోజుల పని కల్పించడంలో కూడా జిల్లా చాలా వెనుకబడి ఉందని.. అధికారులు ఇకపై స్థానికంగానే ఉండాలని తేల్చి చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో లక్ష్యం చేరుకున్న పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. సర్పంచ్‌లను సమన్వయం చేసుకుని పాలనను ముందుకు సాగించాలని, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని కోరారు. వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. సమీక్షలో హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ సందర్శన..
పుర ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఏవైనా ఫిర్యాదు వచ్చాయా అని ఆరా తీశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అధికారులకు అందించాలన్నారు. ఆమె వెంట జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
నామినేషన్ కేంద్రం తనిఖీ..
మక్తల్: స్థానిక పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. ఆమె వెంట పుర కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఏఈ నాగశివ ఉన్నారు.


