బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
నారాయణపేట: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని పురపాలికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. నారాయణపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని.. కేంద్ర నిధులతో అభివృద్ధి చేసుకుందామన్నారు. పేట మున్సిపాలిటీలో 24 వార్డు ఉండగా.. అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు చెప్పారు. ఇందులో ముగ్గురు ముస్లింలు సైతం ఉన్నారన్నారు. పురపాలికపై బీజేపీ జెండా ఎగురవేయాలని పట్టణ ప్రజలను కోరారు. గతంలో పార్టీ నుంచి గెలిచిన చైర్మన్ అభివృద్ధి పేరు చెప్పి నాటి అధికార పార్టీలో చేరారని తెలిపారు. పురపాలికకు రూ.34 కోట్లు అమృత్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటిస్తారా అని విలేకర్లు అడగగా.. రాష్ట్రంలో ఎక్కడా ప్రకటించ లేదని చెప్పారు. అనంతరం నామినేషన్లు వేసిన అభ్యర్థులను ఎంపీ శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో పుర ఎన్నికల ఇన్‌చార్జ్ బి.కార్తీకరెడ్డి, బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావునామాజీ, రతంగ్‌పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు రఘురామయ్యగౌడ్, వినోద్, కిరణ్, బిల్డర్ వెంకట్రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


