ఎన్నికల నియమావళి పాటించాలి
కోస్గి రూరల్/మద్దూర్: పుర ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఈసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు సీతాలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఒకరు లేదా ఇద్దరు ప్రతిపాదకులను మాత్రమే అనుమతించాలని సూచించారు. అధికారులు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, తప్పులుంటే అభ్యర్థులతో సరి చేయించాలన్నారు. గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమం వేదికగా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేయడం, మత విధ్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట పుర కమిషనర్, ఎన్నికల అధికారి నాగరాజు, మేనేజర్ అనిల్‌కుమార్, సీఐ సైదులు, ఎస్‌ఐ బాలరాజు ఉన్నారు.


