ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సుమన్ శెట్టి. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో ‘అధ్యక్షా..’ అంటూ సుమన్ చేసే కామెడీకి తెలుగు ఆడియన్స్ పలగబడి నవ్వారు. జయం తర్వాత సుమన్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకనొక దశలో ఆయన డేట్స్ కూడా దొరకనంత బిజీ కమెడియన్ అయిపోయాడు.
దాదాపు 300పైగా సినిమాల్లో నటించిన సుమన్.. సడెన్‌గా వెండితెరకు దూరం అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మరిచిపోయింది. బిగ్‌బాస్ షోతో మళ్లీ సుమన్ శెట్టి ఫామ్‌లోకి వచ్చాడు. బిగ్‌బాస్ 9వ సీజన్‌లో పాల్గొన్న ఆయన..తనదైన ఆటతీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్‌లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్కవారం ముందు ఎలిమేట్ అయ్యాడు. బిగ్‌బాస్ తర్వాత ఆయన కెరీర్ పరంగా బిజీ అయిపోతారనుకుంటే.. అదీ జరగలేదు. పెద్దగా అవకాశాలు అయితే రాలేదు.
300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదని సుమన్ శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఒకప్పుడు నేను 30 రోజులూ షూటింగ్‌లోనే ఉండేవాడిని.300పైగా సినిమాలు చేశా. నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్ ఎమోషనల్ అయ్యాడు.


