మనాలికి కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్‌! | Sakshi
Sakshi News home page

మనాలి చేరుకున్న కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్‌!

Published Mon, Sep 14 2020 2:29 PM

Kangana Slams Sonia Gandhi Cost Of Freedom Will Only Be Blood - Sakshi

డెహ్రాడౌన్‌: బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. ఇరు వర్గాలు మాటల తూటాలతో పరస్పరం దాడికి దిగుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కంగన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సోనియాపై విమర్శలు ఎక్కుపెట్టారు. స్వస్థలానికి చేరుకున్న అనంతరం.. ‘‘ఈ ఏడాది ఢిల్లీ గుండె కోతకు గురైంది. అక్కడ రక్తం ప్రవహించింది. సోనియా సేన ముంబైలో ఆజాద్‌ కశ్మీర్‌ అని నినాదాలు చేస్తోంది, ఈ రోజు స్వేచ్చ ఉందని భావించగలిగే విషయం అంటే గొంతెత్తడం ఒకటే, నాకు మీ గొంతు ఇవ్వండి, లేదంటే స్వేచ్ఛ అంటే రక్తం చిందించడమే అవుతుంది’’అంటూ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో చోటుచేసుకున్న ఘర్షణలను వ్యతిరేకిస్తూ ముంబైలో.. ‘ఫ్రీ కశ్మీర్‌’ ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఈ సందర్భంగా కంగన ప్రస్తావించారు. (చదవండి: కంగనా రనౌత్‌కు బీఎంసీ మరో షాక్‌)

బరువెక్కిన హృదయంతో మంబైని వీడుతున్నా
శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌- కంగనల మధ్య సోషల్‌ మీడియాలో చోటుచేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఆమె బుధవారం ముంబైలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికే పాలిలోని ఆమె కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వాటిని కూల్చివేశారు. అంతేగాక కంగనకు సంబంధించిన మరో నివాసం కూడా అక్రమ కట్టడం అని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ అయిన ఆమె.. సోమవారం స్వస్థలం హిమాచల్‌ ప్రదేశ్‌కు పయనమయ్యారు.

మనాలిలోని తన నివాసానికి చేరుకునే క్రమంలో.. ‘‘బరువెక్కిన హృదయంతో ముంబైని వీడుతున్నాను. నాపై వరుస దాడులు, వేధింపులు, నా ఇంటిని, ఆఫీసును కూల్చేందుకు జరిగిన ప్రయత్నాలు నన్ను భయాందోళనకు గురిచేసిన తీరు, నా చుట్టూ సాయుధులతో కల్పించిన భద్రత.. నేను పీఓకేతో పోల్చినట్లుగా అన్న మాటలు సరైనవేనని నిరూపించేలా ఉన్నాయి’’ అంటూ మరోసారి సంచలన ట్వీట్‌ చేశారు. ఇక కంగన ముంబైని వీడి వెళ్లడంపై స్పందించిన శివసేన నేత ప్రతాప్‌ సర్నాయక్‌.. ‘‘తనను సమర్థించిన వాళ్ల ముఖాలను కంగన నల్లముఖాలు చేసింది. తను వెళ్లిపోయింది.. ఇప్పుడు అరవండి.. జై మహారాష్ట్ర’’అని పేర్కొన్నారు. (కంగన వెనుక ప్రధాని నరేంద్ర మోదీ!)

Advertisement
Advertisement