
షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ చేసి ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది చాందినీ చౌదరి. కలర్ ఫోటో సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకున్నా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రావడం లేదు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాందినీకి ఇప్పుడు సైబర్ వేధింపులు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టినట్లయ్యింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'నా పేరు, ఫోటోలతో గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ నెంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కి పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్‌లో నా పేర్లు వాడుకుంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు.
నాకే కాదు నా కోస్టార్స్ పేర్లు, ఫోటోలు కూడా వాడుతున్నారు. మీలో ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి. మీ వివరాలను వారితో షేర్ చేసుకోకండి' అంటూ నెటిజన్లను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్‌షాట్లను కూడా చాందినీ ఈ సందర్భంగా పోస్ట్ చేసింది.