'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే | Bigg Boss 7 Telugu Launch Episode Live Updates: BB7 Contestants List Details - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: 'బిగ్‌బాస్ 7' ఈసారి కలర్‌ఫుల్.. ఎవరెవరు వచ్చారంటే?

Published Sun, Sep 3 2023 6:47 PM

Bigg Boss 7 Telugu Launch Episode Live Updates: BB7 Contestants List Details - Sakshi

తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు 'బిగ్‌బాస్'. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి కాగా,  తాజాగా ఆదివారం ఏడో సీజన్‌ అట్టహాసంగా మొదలైంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. తనదైన మార్క్ చమత్కారాలతో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు. స్టార్ మాలో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరిగిన ఈ షోకి ఎవరెవరు వచ్చారు? లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

ఇకపోతే 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్‌తో హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. ఈ సీజన్ అంతా కూడా ఎవరి ఊహకు అందని విధంగా ఉల్టా పల్టాగా సాగబోతుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇక హౌసులోకి తొలి కంటెస్టెంటుగా 'జానకి కలగనలేదు' సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌసులోకి అడుగుపెట్టింది.

తొలి కంటెస్టెంట్‪‌ ప్రియాంక జైన్
బిగ్ బాస్ 7వ సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా 'జానకి కలగనలేదు' సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. తప్పకుండా ఈసారి గెలిచే.. హౌస్ నుంచి బయటకు వెళ్తానని శపథం చేసింది. ఈమె స్వతహాగా యూట్యూబర్ కావడంతో స్వయంగా బిగ్ బాస్ హౌస్ అంతా తిరిగి తిరిగి చూపించింది. అయితే ఈసారి హౌసులో మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఫర్నిచర్, హౌసులో ఉండే అర్హత కూడా మీరే సంపాదించుకోవాలి అని నాగార్జున ప్రియాంకతో చెప్పుకొచ్చారు. 

ఎవరీ ప్రియాంక?
పేదింట పుట్టిన ప్రియాంక జైన్‌ స్వయంకృషితో పైకి ఎదిగిన అమ్మాయి. బెంగళూరులో చదువు పూర్తి చేసిన ఈ బ్యూటీ మొదట సినిమాలు చేసింది. 2015లో తమిళంలో రంగి తరంగ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాది గోలిసోడా మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. 2018లో చల్తే చల్తే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ సినిమాలు తనకు పెద్దగా వర్కవుట్‌ కాలేదు. దీంతో బుల్లితెరపై తన లక్‌ పరీక్షించుకుంది. తెలుగులో వరుసగా సీరియల్స్‌ చేస్తూ సీరియల్‌ స్టార్‌గా వెలుగు వెలుగుతోంది. మౌనరాగంలో తనతో పాటు నటించిన శివకుమార్‌తో ప్రేమలో ఉందీ బ్యూటీ. ప్రస్తుతం తను నటిస్తున్న ఓ సీరియల్‌కు శుభం కార్డు పడటంతో బిగ్‌బాస్‌ 7లో అడుగుపెట్టింది. మరి ప్రియాంక ఇక్కడ కూడా ఓ వెలుగు వెలుగుతుందా? లేదంటే వెనకబడిపోతుందా? అనేది చూడాలి..

ఫస్ట్ టాస్క్ ఇచ్చేసిన నాగ్
హాలోగ్రామ్ ద్వారా హౌసు లోపలికి వెళ్లిన నాగార్జున.. ప్రియాంకని యాక్టివిటీ రూమ్ దగ్గరకు రమ్మని చెప్పిన హౌస్ట్ నాగార్జున. వీకెండ్ మాత్రమే కాదు ఇకపై ప్రతి క్షణం హౌసులో ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తానని చెప్పారు. అలానే ఓ సూట్ కేసు చూపించి, ఎవరికీ కనిపించకుండా దాన్ని దాచేయమని నాగ్.. ప్రియాంకతో చెప్పారు. ఒకవేళ ఎవరికైనా అది దొరికితే అందులో ఉన్న పవర్ వాళ్లకు దక్కుతుందని నాగ్ చెప్పారు. దీంతో జైలు వాష్ రూమ్ లోని కమోడ్ వెనక ప్రియాంక ఆ సూట్ కేసుని దాచిపెట్టింది.

రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ
బిగ్ బాస్ హౌసులోకి రెండో కంటెస్టెంట్ గా ప్రముఖ హీరో శివాజీ ప్రవేశించారు. పలు తెలుగు సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. చాలారోజుల నుంచి సినిమాల్లో నటించట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. 

ఎవరీ శివాజీ?
బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారాడు శివాజీ. హీరో ఫ్రెండ్‌ పాత్రలు చేసే స్థాయి నుంచి హీరో రేంజ్‌కు ఎదిగాడు. అతడు నటించిన తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ. కానీ ఫస్ట్‌ రిలీజైంది మాత్రం మాస్టర్‌. ఈ సినిమాకుగానూ అతడు రూ.15 వేలు అందుకున్నాడు. అందరు కుర్రాళ్లలాగే ఆ డబ్బుతో అమ్మకు బంగారం కొనిచ్చాడు శివాజి.

మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి, అదిరిందయ్యా చంద్ర, టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. నితన్‌కు జయం, దిల్‌, సంబరం సినిమాల్లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. 2018లో వచ్చిన గ్యాంగ్‌స్టర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో చివరిసారిగా కనిపించాడు. రాజకీయాల్లో ‍ప్రవేశించాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇన్నాళ్లకు బిగ్‌బాస్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు.

అమ్మ గుర్తొచ్చి ఎమోషనల్
నటుడిగా తన తొలి చెక్ నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నానని శివాజీ అప్పటి రోజులని గుర్తుచేసుకున్నారు. అలానే నాగ్ సినిమా వచ్చిన ప్రతిసారి గ్లామర్ విషయంలో తనకు తిట్లు పడతుంటాయని అన్నారు. ఇకపోతే కోడిపిల్లల్ని పెంచి, సంక్రాంతికి వాటిని అమ్మి తమని పోషించేదని శివాజీ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు గోల్డ్ చైన్ కొనిచ్చాని శివాజీ చెప్పుకొచ్చాడు. 

మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని 
తెలుగులో పలు సినిమాల్లో పాటలు పాడి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న దామిని.. మూడో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాస్ట్ బేబీ పాటతో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఎవరీ దామిని?
పచ్చబొట్టేసిన.. పిల్లగాడా నీతో.. పాటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది దామిని. ఈమె పుట్టి పెరిగింది రాజమండ్రిలో అయినా తర్వాతి కాలంలో తన కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయింది. దామిని సోదరి మౌనిమ సైతం సింగర్‌గా రాణిస్తోంది. ఈమె బాహుబలి: ద కన్‌క్లూజన్‌లో పాటలు ఆలపించింది. కాగా దామిని.. 2011లో పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో రెండో స్థానంలో నిలిచింది. తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమెకు సినిమాలో పాడే అవకాశాలు వచ్చాయి. అయితే సినిమా పాటలే కాకుండా సొంతంగా ఆల్బమ్స్‌ కూడా చేస్తోంది దామిని. స్టేజీ షోల ద్వారా సైతం తన గాత్రంతో సంగీతప్రియులను ఉర్రూతలూగిస్తోంది.

నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్
బిగ్ బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్‌గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. 'బ్యాడ్ బాయ్' పాటకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నాడు.

ఎవరీ ప్రిన్స్ యావర్?
ఇతడి బాడీ చూస్తే మీకీపాటికే అర్థమైపోయుంటుంది మోడల్‌ అని! ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటాడు. కానీ తెలుగువారికి మాత్రం పెద్దగా పరిచయం లేడు. ఆ మధ్య తెలుగులో ఓ సీరియల్‌లో నటించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇ‍ఇష్టపడతారు. అందుకే వెంటనే ఓకే చేశాడు. ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఐదో కంటెస్టెంట్‌గా నటి శుభశ్రీ 
బిగ్ బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్ శుభశ్రీ ప్రవేశించింది. ట్రెండింగ్ సాంగ్ 'సమ్మోహనుడా' స్టెప్పులేసి, గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఎవరీ శుభశ్రీ?
శుభశ్రీ రాయగురు ప్రొఫెషనల్‌గా లాయర్‌.. కానీ సినిమాలు చేస్తుంది. తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. ఒడిశాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది.

ఐదుగురికి ఫస్ట్ టాస్క్ పెట్టిన నాగ్
తొలి కంటెస్టెంట్ ప్రియాంకకు ఇచ్చిన సూట్ కేసులో ఉన్న క్యాష్ తీసుకుని హౌసు నుంచి వెళ్లిపోమని ఆమెకు నాగ్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె నో చెప్పి క్యాన్సిల్ చేసుకుంది. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ కూడా ఆ సూట్ కేసుని తీసుకుని బయటకెళ్లిపోవడానికి ససేమిరా అన్నారు. తొలుత రూ.20 లక్షలు, ఆ తర్వాత రూ.25 లక్షలు, అనంతరం రూ.30 లక్షలు అని హోస్ట్ నాగ్ ఆఫర్ చేసినా సరే అందరూ నో అంటే నో అని చెప్పేశారు.

ఆరో కంటెస్టెంట్‌గా షకీలా
బిగ్ బాస్ హౌసులోకి ఆరో కంటెస్టెంట్‌గా నటి షకీలా ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు అయినా ఈమె తన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఒకప్పుడు షకీలా అని ఇప్పుడు షకీ అమ్మ అని చెప్పుకొచ్చింది. అలానే ఈమె చూసుకుంటున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ని(తంగం & షాషా) నాగ్ స్టేజీపైకి పిలిచారు.

ఎవరీ షకీలా?
బోల్డ్‌ క్యారెక్టర్లకు పెట్టింది పేరు షకీల. వెండితెరపై బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే! రియల్‌ లైఫ్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ఆమె 18 ఏళ్లకే నటించడం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన ఆమె గతంలోనూ బిగ్‌బాస్‌ షోలో పాల్గొంది.

ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్
బిగ్ బాస్ హౌసులోకి ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చారు. 'దళపతి' పాటకు స్టెప్పులేసి తన గ్రాండ్ ఎంట్రీని చాటుకున్నారు. ఇకపోతే ఈ మధ్య 'నీతోనే డ్యాన్స్' షోలో సందీప్ విజేతగా నిలవడం విశేషం.

ఎవరీ సందీప్?
టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్‌ సీజన్‌లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్‌ కూడా డ్యాన్సరే! అయితే ఆట సందీప్‌కు తాను చెప్పింది తప్పితే ఎదుటివాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడడు, అసలు వినిపించుకోడు. ఇటీవలే అతడు తన భార్యతో కలిసి నీతోనే డ్యాన్స్‌ కప్‌ గెలిచాడు. అయితే ఈ షో జరిగినన్ని రోజులు గేమ్‌ అమర్‌ దీప్‌ ఫ్యాన్స్‌ వర్సెస్‌ ఆట సందీప్‌ ఫ్యాన్స్‌ అన్నట్లుగా నడిచింది. మరి బిగ్‌బాస్‌లోనూ వీరి మధ్య వార్‌ జరుగుతుందా? ఆట సందీప్‌ తన కోపాన్ని నిగ్రహించుకుని ఎక్కువ వారాలు కొనసాగుతాడా? అన్నది చూడాలి!

ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటి శోభాశెట్టి
బిగ్ బాస్ హౌసులోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా కార్తీకదీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. జిమ్మిక్కి పొన్ను పాటకి మంచి స్టెప్పులేసి ఆకట్టుకుంది. అయితే శోభాశెట్టితో మాట్లాడిన హోస్ట్ నాగార్జున.. హౌసులో ఎవరైనా సరే బ్యూటీఫుల్ అని చెబితే శోభాకు వీకెండ్ లో పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు.

ఎవరీ శోభాశెట్టి?
శోభా శెట్టి అంటే గుర్తుపడతారో లేదో కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. డాక్టర్‌బాబును దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నిన అందమైన విలనే మోనిత అలియాస్‌ శోభా శెట్టి. ఈమె స్వస్థలం కర్ణాటక అయినా అచ్చ తెలుగింటి అమ్మాయిగా సీరియల్‌లో నటించి విశేష అభిమానులను దక్కించుకుంది. ఇంత పాపులారిటీ ఉన్న చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది.

ఇంటి నుంచి స్కూలుకు వెళ్లాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదట! ఈ క్రమంలో తన చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేక సేఫ్టీ పిన్‌ సాయంతో దాన్ని నెట్టుకొచ్చేదట. కొన్నిసార్లయితే కాళ్లకు చెప్పులు లేకుండానే స్కూలుకు నడిచి వెళ్లింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కన్నడలో అంజనీపుత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తెలుగు సీరియల్‌లో మోనిత పాత్రతో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువైంది. మరి బిగ్‌బాస్‌ షోతో వారి మనసులు కూడా దోచుకుంటుందేమో చూడాలి!

తొమ్మిదో కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ
ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజ.. బిగ్ బాస్ హౌసులోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ వచ్చాడు. తన గురించి చెబుతూ ఫన్ క్రియేట్ చేశాడు. ఈసారి హౌసులో ఇతడు మంచి కామెడీ జనరేట్ చేస్తాడని ఏవీ చూస్తేనే అర్థమైపోయింది. ఇకపోతే టేస్టీ తేజ.. థర్మల్ ఇంజినీరింగ్‌లో ఎమ్.టెక్ చేశాడు. 

ఎవరీ టేస్టీ తేజ?
టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే ఉంటుంది అతడి వ్యవహారం. యూట్యూబ్‌లో ఎప్పుడు చూసినా ఫుడ్‌ వీడియోలు చేస్తూ ఉంటాడు. తరచూ సెలబ్రిటీలను కలుస్తూ ఉంటాడు. సినిమా వాళ్లను కలుస్తాడు అంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తాడో, రీల్స్‌ చేస్తాడో అనుకునేరు... తనదైన స్టైల్‌లో సెలబ్రిటీలతో కలిసి మంచి విందు భోజనం చేస్తూ కబుర్లాడతాడు. పనిలో పనిగా భోజనం చేస్తూనే సినిమా ప్రమోషన్స్‌ చేస్తాడు. మొదట్లో జబర్దస్త్‌ షోలోనూ మెరిసిన ఇతడు ప్రస్తుతం మాత్రం యూట్యూబ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్‌ షోతో జనాలకు మరింత దగ్గరవ్వాలనుకుంటున్న ఇతడు ఏడో సీజన్‌లో పాల్గొన్నాడు. మరి అతడి కల ఎంతమేరకు నెరవేరుతుందో చూడాలి!

పదో కంటెస్టెంట్‌గా నటి రతిక 
బిగ్ బాస్ హౌసులోకి యువ నటి రతిక.. పదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె.. తనకు గుర్తింపు రాలేదని అందుకే హౌసులోకి వచ్చానని చెప్పుకొచ్చింది. 

ఎవరీ రతిక?
రతిక రోజ్ అచ్చ తెలుగమ్మాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. ముందుగా మోడలింగ్‌ చేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో ఓ పాత్రలో నటించింది. నేను స్టూడెంట్‌ సర్‌ చిత్రంలో పోలీసాఫీసర్‌గా మెప్పించింది. తనకంటూ ఫేమ్ రావాలని బిగ్‌బాస్‌ 7లో అడుగుపెట్టి అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. మరి ఈ అమ్మడు ఈ షో ద్వారా ఏ రేంజ్‌లో క్లిక్‌ అవుతుందో చూడాలి!

స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ
'ఖుషి' ప్రమోషన్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ.. బిగ్ బాస్ హౌసులోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ నాగ్ తో ఫన్ జనరేట్ చేశాడు. ఇక హీరోయిన్ సమంత ఎ‍క్కడా అని నాగ్, విజయ్ దేవరకొండని అడగ్గా ఆమె అమెరికాలో ఉందని, త్వరలో తిరిగొస్తుందని చెప్పాడు. అలానే సీజన్ ప్రారంభమైన తొలిరోజే ఓ స్టార్.. హౌసులోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఫర్నిచర్ టాస్క్.. రూమ్స్ డిస్ట్రిబ్యూషన్
ఇకపోతే హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి పదిమంది కంటెస్టెంట్స్ మధ్య.. గెస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండ పర్యవేక్షణలో ఓ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో స్టోర్ రూమ్ నుంచి ఫర్నిచర్.. బయట మార్క్ చేసిన ప్లేసులో పెడితే అవన్నీ కంటెస్టెంట్స్ కి చెందుతాయని నాగార్జున అన్నారు. అనంతరం వీళ్లలో బాగా కష్టపడిన శుభశ్రీకి డీలక్స్ రూమ్, ఆట సందీప్ కి స్టాండర్డ్ రూమ్ ఇచ్చారు. 

పదకొండో కంటెస్టెంట్‌గా హీరో గౌతమ్
బిగ్ బాస్ హౌసులోకి పదకొండో కంటెస్టెంట్‌గా డాక్టర్ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 'ఆకాశ వీధుల్లో' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఎంట్రీతోనే చేతికి బేడీలు వేసి, ఓ టాస్క్ కూడా ఇతడికి నాగార్జున ఇచ్చాడు.

ఎవరీ గౌతమ్?
డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ బిగ్‌బాస్‌ షోలో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్‌కు చిన్నప్పటి నుంచే రైటర్‌, డైరెక్టర్‌ కావాలని ఉండేదట. అయితే తన పేరెంట్స్‌కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరకమైన భయం. దీంతో వారికోసం చదువుపై దృష్టిపెట్టాడు. అలా డాక్టరయ్యాడు.

అతడికి ఉన్న ఆసక్తి మేరకు హీరోగానూ మారాడు. ఆకాశవీధుల్లో సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన అతడు డాక్టర్‌ను కాబట్టి అందరికీ పనికొస్తాను, తనను నామినేట్‌ చేయొద్దు అంటున్నాడు. మరి ఈ డాక్టర్‌ బాబు హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి!

పన్నెండో కంటెస్టెంట్‌గా కిరణ్ రాథోడ్
పలు దక్షిణాది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ రాథోడ్.. పన్నెండో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు బాగా పేరు తెచ్చిన 'జెమిని' సినిమాలోని పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. 

ఎవరీ కిరణ్ రాథోడ్?
కిరణ్‌ రాథోడ్‌.. ఈమె బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ కజిన్‌ కూడా! హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేను చిత్రంతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి రజనీకాంత్‌ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో ఈ ఛాన్స్‌ వదిలేసుకుంది. 2016లో భాజా భజంత్రీలు(డబ్బింగ్‌) సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె ప్రస్తుతం రీఎంట్రీకి రెడీ అయింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ లియో సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో కిరణ్‌ రాథోడ్‌ బిగ్‌బాస్‌ 7లో అడుగుపెట్టింది. మరి తన రీఎంట్రీకి బిగ్‌బాస్‌ 7 ఎలా ఉపయోగపడుతుందో చూడాలి!

పదమూడో కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్
గత కొన్నిరోజుల నుంచి అనుకున్నట్లుగానే యువరైతు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌసులోకి పదమూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన గురించి ఎమోషనల్ అయ్యాడు.

ఎవరీ పల్లవి ప్రశాంత్?
వ్యవసాయం అంటేనే ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ యువకుడు మాత్రం దాన్నే నమ్ముకున్నాడు. ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అతడే యువ రైతు పల్లవి ప్రశాంత్‌.. తను చేసే ప్రతి పనిని వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌  చేస్తూ ఉంటాడు. రైతు బిడ్డను అన్నా.. అంటూ ప్రతిసారి ఎమోషనల్‌ వీడియోలు చేస్తుంటాడు పల్లవి ప్రశాంత్‌. బిగ్‌బాస్‌కు వెళ్లాలనేది తన కల అని నిత్యం చెప్తూ ఉండే ఇతడు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. షోలో పార్టిసిపేట్‌ చేయాలన్న కల నెరవేర్చుకున్నాడు, అక్కడివరకు బానే ఉంది.. కానీ హౌస్‌లో కూడా సింపథీ ప్లాన్‌ వర్కవుట్‌ చేయాలనుకుంటే మాత్రం కష్టమే.. మరి ఇతడి గేమ్‌ ఎలా ఉండబోతుందో రానున్న రోజుల్లో తేలనుంది.

పద్నాలుగో కంటెస్టెంట్‌గా అమర్‌దీప్
బిగ్ బాస్ హౌసులోకి పద్నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. 'పూనకాలు లోడింగ్' పాటకు సూపర్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

ఎవరీ అమర్‌దీప్?
తెలుగబ్బాయి అమర్‌దీప్. విదేశాల్లో చదువుకున్న ఇతడికి సినిమాలపై ఆసక్తి ఉండేది. మొదట పరిణయం అనే షార్ట్‌ ఫిలిం చేయగా అది బాగా క్లిక్‌ అయింది. దీంతో ఆఫర్స్‌ వచ్చాయి. యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌ చేశాడు. అక్కడి నుంచి సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ వర్క్‌ చేశాడు. అలాగే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేశాడు.

జనాల్లో పాపులారిటీ పెరగడంతో సీరియల్‌ హీరోగా మారాడు. అప్పుడప్పుడూ షోలలోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. రాజుగారి కిడ్నాప్‌, అభిలాష, ఐరావతం, ప్రేమదేశం సినిమాలు కూడా చేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు అమర్‌దీప్‌. అయితే బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు మాత్రం ఐదో సీజన్‌లోనే ఇతడు దగ్గరయ్యాడు.

అప్పుడు మానస్‌కు సపోర్ట్‌ చేసేందుకు బిగ్‌బాస్‌ స్టేజీపైకి వచ్చాడు అమర్‌. తన మాటలతో, ప్రవర్తనతో అందరినీ బుట్టలో వేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్‌ సీజన్‌లో రావడం ఖాయం అనుకున్నారంతా! కానీ రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు షోలో అడుగుపెట్టాడు బుల్లితెర హీరో. గతేడాది నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్న అమర్‌ భార్యతో కలిసి షోలో పాల్గొంటాడునుకున్నారు. కానీ చివరకు ఒక్కడే వచ్చేశాడు.

ఇక పదిహేనో కంటెస్టెంట్ అనే నాగ్ చెప్పేసరికి హీరో నవీన్ పొలిశెట్టి వచ్చాడు. అతడిని హౌసులోకి పంపిన తర్వాత గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ముగించేశారు. సోమవారం ఎపిసోడ్ లో హౌస్‌మేట్స్‌తో అతడు చేసే ఎంటర్ టైన్‌మెంట్ చూపించనున్నారు. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు. దాదాపు సోషల్ మీడియాలో వినిపించిన వాళ్లే హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గత సీజన్ 20 మంది.. లాంచ్ ఎపిసోడ్‌లో వచ్చారు. మరి ఈసారి ఆ నంబర్ తగ్గించారా? లేకపోతే మిగిలిన వాళ్లని వారం వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement