బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయ‌ల్‌ | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అంద‌రికీ దూరంగా నోయ‌ల్‌

Published Thu, Dec 3 2020 8:40 PM

Bigg Boss 4 Telugu: Noel Sean Shocking Comments On This Show - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అనారోగ్య కార‌ణాల‌తో నోయ‌ల్‌ షో మ‌ధ్య‌లో నుంచే వెళ్లిపోయాడు. ఆ మ‌ధ్య‌ త‌న రీఎంట్రీ ఉంటుంద‌ని హోరెత్తించాడు. గేమ్ ఈజ్ స్టిల్ ఆన్‌.. ఈసారి వెళ్తే మామూలుగా ఉండ‌దు అంటూ పోస్టులు పెట్టాడు. దీంతో రీఎంట్రీ ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. కానీ చివ‌రాఖ‌ర‌కు అదంతా ఉత్తిదే అని తేలింది. దీంతో అత‌డు త‌న‌ స్నేహితుల‌కు స‌పోర్ట్ చేయ‌డం ప్రారంభించాడు. అభిజిత్‌, హారిక‌కు ఓటేయ‌మ‌ని ప్ర‌చారం చేప‌ట్టాడు. ఆ ఇద్ద‌రి గెలుపు గురించి అనునిత్యం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నాడు.


అందుకే సిటీకి దూరంగా ఉంటున్నా..
ఎలిమినేట్ అయిన‌ కంటెస్టెంట్లు అంద‌రూ జోరుగా ఇంట‌ర్వ్యూలు చేస్తుంటే నోయ‌ల్‌ మాత్రం వాటికి దూరంగా ఉన్నాడు. తాజాగా ఎక్క‌డో సిటీకి దూరంగా, రాష్ట్రానికి స‌రిహ‌ద్దులో ఉన్న నోయ‌ల్ నివాసానికి హారిక అన్న‌య్య వంశీ, ఆమె స్నేహితుడు, యాంక‌ర్‌ నిఖిల్ వెళ్లి స‌ర్‌ప్రైజ్ చేశారు. నోయ‌ల్‌కు చెప్పాపెట్ట‌కుండా అత‌డి ఇంటికి చేరుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నోయ‌ల్ షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించాడు. 'మ‌నుషుల‌ను ఎంత ఇష్ట‌ప‌డితే అంత దూరంగా ఉండాలి. వాళ్ల‌కు ఎంత‌ ద‌గ్గ‌ర‌గా ఉంటే అన్ని ప్రాబ్ల‌మ్స్‌ వ‌స్తాయి, అందుకే సిటీకి దూరంగా ఉంటున్నా'న‌ని పూర్తి వైరాగ్యంలో ఉన్న‌ట్లుగా మాట్లాడాడు. ఏడాదిన్న‌ర క్రిత‌మే ఈ ఇల్లు కొన్నాన‌ని తెలిపాడు. (చ‌ద‌వండి: కాళ్లు ప‌ట్టుకుంటే బాగోదు, ప్లీజ్‌..: అవినాష్‌)

అమ్మాయిని గెలిపించండి..
బిగ్‌బాస్ షో గురించి చెప్తూ అది మ‌న‌క‌వ‌స‌రం లేద‌ని అర్థ‌మైంద‌న్నాడు. ఆ షోకు ఎందుకెళ్లానో, ఏమో అనిపించిందని బాధ‌ప‌డ్డాడు. షో చూడ‌టం కూడా మానేశాన‌ని తెలిపాడు. హౌస్‌లో అంద‌రూ మంచివాళ్లేన‌ని, త‌న స‌పోర్ట్ మాత్రం అభిజిత్‌, హారిక‌కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాడు. ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిల‌బ‌డ‌టం మామూలు విష‌యం కాద‌ని హారిక‌ను మెచ్చుకున్నాడు. ఆమె మ‌నుషుల్ని వాడుకుని గేమ్ ఆడి టైటిల్ కొట్టాలి, రూ.50 ల‌క్ష‌లు తీసుకోవాలి, వాడేమైపోతే ఏంటి? వీడేమైపోతే ఏంటి? అనుకుని ఆడే ర‌కం కాదు. తాను గెల‌వాల‌న్న కోణంలోనే ఆడుతుంద‌ని చెప్పుకొచ్చాడు. హారిక‌కు ల‌వ్ ట్రాకులు, కామెడీ ట్రాకులు లేవ‌ని క‌ష్ట‌ప‌డి ఆడి ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చింద‌న్నాడు. జీవితంలో కూడా ఎన్నో క‌ష్టాలు ప‌డింద‌ని, ఈసారైనా అమ్మాయిని గెలిపించ‌మ‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చాడు. (చ‌ద‌వండి: నోయ‌ల్ అవుట్‌, మోక‌రిల్లి దండం పెట్టిన అవినాష్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement