క్యాంపుల్లోనే కౌన్సిలర్లు
నర్సాపూర్: అన్ని పార్టీల కౌన్సిలర్లు మూడు రోజులుగా క్యాంపుల్లోనే ఉన్నారు. నర్సాపూర్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌కు ఐదుగురు, బీజేపీకి నలుగురు కౌన్సిలర్లు ఉండగా, అన్ని పార్టీల నేతలు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయితే అన్ని పార్టీల కన్న తక్కువ స్థానాల్లో గెలిచినా బీజేపీ సైతం పీఠం కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తమ పార్టీలో చేరితే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని బీజేపీకి కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చిందని తెలిసింది. ఈ మేరకు ఆపార్టీ నాయకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఎదుటి పార్టీలకు చెందిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల ముఖ్య నాయకులు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. కౌన్సిలర్లు క్యాంపులలో ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తమ పార్టీలో చేరితే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము కన్న ఎక్కువ డబ్బు (గుడ్‌విల్)తో పాటు సముచిత స్థానం కల్పిస్తామంటూ రక రకాల ఆశలు చూపుతున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆదివారం మహా శివరాత్రి సందర్భరంగా కౌన్సిలర్లను క్యాంపుల నుంచి దేవాలయాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
25 మంది కొత్తవారే..
మెదక్ కలెక్టరేట్: ఇటీవల జరిగిన మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పుర ప్రజలు అత్యధికంగా కొత్తవారికే అవకాశం కల్పించారు. అందులో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 32 వార్డులకు గానూ 25 మంది కొత్తవారు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. మరో ఏడుగురు గతంలో ఒకసారి గెలిచిన వారు ఉన్నారు. అలాగే మొదటిసారి ఏడుగురు ముస్లిం అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం ఏ పార్టీ చైర్మన్ పీఠం చేజిక్కించుకున్నా.. యువ పాలకవర్గంతో అవినీతికి తావులేకుండా అభివృద్ధిలో ముందుకు సాగాలని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


