విద్య, వైద్యరంగాల్లో జిల్లా అభివృద్ధి
● కలెక్టర్ విజయేందిర బోయి
● గ్రూప్–1 ట్రైనీ అధికారుల బృందం జిల్లా సందర్శన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గతంలో వలస కూలీలకు ప్రసిద్ధి చెందిన జిల్లా కొన్నేళ్లలో సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమల రంగాల్లో మంచి అభివృద్ధి సాధించిందని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ పొందుతున్న 60మంది గ్రూప్–1 ట్రైనీ అధికారులు బృందం రెండురోజుల(ఫిబ్రవరి 17, 18) క్షేత్రస్థాయి పర్యటన శిక్షణ నిమిత్తం మంగళవారం మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా గ్రామాలను సందర్శించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల ప్రగతిని తెలుసుకోనున్నారు. అందులో భాగంగా తొలుత గ్రూప్– 1 అధికారుల శిక్షణ బృందం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, న్యాయశాఖలతో పాటు ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఐఐఐటీ ఏర్పడిందని, దీనికి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఐఐఐటీ విద్యాసంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. దీంతోపాటు జిల్లాలో అనేక ప్రభుత్య జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాయని, దీంతోపాటు త్వరలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా ప్రజలకు అత్యుత్తమ ఆధునిక వైద్యసేవలు అందించేందుకు అందుబాటులో రానుందన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ అధికారులకు కలెక్టర్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్య యంత్రాంగం మొత్తం ప్రజలసేవ కొరకై ఉన్నదన్నారు. మీరు ప్రజల సేవకులుగా భావించాలి, అధికారులుగా కాదని సూచించారు. ట్రైనీ అధికారులు గ్రామాల సందర్శనలో భాగంగా గండీడ్, నవాబ్‌పేట్, చిన్నచింతకుంట, అడ్డాకుల, కౌకుంట్ల మండలాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి జీవన స్థితిగతులు, ప్రభుత్వ సేవల గురించి తెలుసుకుంటారని తెలిపారు. 60 మంది ట్రైనీ అధికారుల్లో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు, ట్రైనీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు, ట్రైనీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, ట్రైనీ మున్సిపల్ కమిషనర్లు, ట్రైనీ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌లు, ట్రైనీ జైలర్లు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఏ నర్సింహులు, జిల్లా సంక్షేమ అధికారి జరీనా తదితర అధికారులు పాల్గొన్నారు.


