కాంగ్రెస్‌లో జోష్!
నిజామాబాద్ మేయర్‌గా ఉమారాణి
నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి..
మున్సిపల్ ఎన్నికల్లో ఆఖరి ఘట్టమైన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఎన్నికలు పూర్తవగానే బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 49 వార్డులు ఉన్న కామారెడ్డి మున్సిపాలిటీలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటకపోవడంతో హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే.. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయి. ఆ రెండు పార్టీలు పదవులను పంచుకున్నాయి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో మాట్లాడి అవగాహన కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా చైర్మన్ పదవిని కాంగ్రెస్, వైస్ చైర్మన్ పదవిని బీఆర్‌ఎస్, అలాగే తలా రెండు కోఆప్షన్ పదవులను తీసుకున్నారు. నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఈ విజయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌కు అదే ఊరట..
మున్సిపల్ ఎన్నికలలో బీఆర్‌ఎస్ సత్తా చాటలేకపోయింది. బాన్సువాడలో మూడు చోట్ల గెలిచిన ఆ పార్టీ.. బిచ్కుందలో 2 వార్డుల్లో గెలవగా ఎల్లారెడ్డిలో ఒక్క స్థానానికే పరిమితమయ్యింది. కామారెడ్డి బల్దియాలో 11 స్థానాలను గెలుచుకున్నా.. మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే కామారెడ్డిలో హంగ్ ఏర్పడడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. కింగ్ మేకర్‌గా నిలిచిన ఆ పార్టీ వైస్ చైర్మన్ పదవితోపాటు రెండు కోఆప్షన్ స్థానాలను పొందగలిగింది. ఈ ఒక్కటి మాత్రమే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం.
బీజేపీకి బూస్ట్..
కామారెడ్డి బల్దియాలో 16 స్థానాలను గెలుచుకుని రెండో పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పురపీఠాన్ని కై వసం చేసుకోవడం కోసం పావులు కదిపింది. అయితే కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్ అవగాహన కుదుర్చుకోవడంతో ఆ పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. కాగా బల్దియాలో ఆ పార్టీ బలం గతంతో పోల్చితే రెట్టింపయ్యింది. మరోవైపు ఇప్పటివకు ఉనికే లేని బాన్సువాడలో మూడు వార్డులను గెలుచుకోవడమే కాకుండా మరికొన్నిచోట్ల ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ విజయాలు ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చాయని భావిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర పాలక సంస్థలో మొత్తం 60 మంది కార్పొరేటర్లున్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో హోదా లో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మేయర్‌గా కాంగ్రెస్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి, బీజేపీ కౌన్సిలర్ జి.స్రవంతిరెడ్డి పోటీ చేశారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్, బీజేపీ అభ్యర్థిగా బంటు రాము పోటీపడ్డారు. మేయర్‌గా ఉమారాణి, డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఇద్దరూ 34– 31 ఓట్ల తేడాతో గెలిచారు.
భీమ్‌గల్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా బొదిరే నాగమణి, వైస్ చైర్‌పర్సన్‌గా సంటి లత ఎన్నికయ్యారు.
బోధన్ చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందిన తూము పద్మ శరత్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన మీర్ ఇలియాస్ అలీలను ఎన్నుకున్నారు.
ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన గోనె లహరి, వైస్ చైర్మన్‌గా అదే పార్టీకి చెందిన కాటిపల్లి వెంకట్‌రెడ్డి ఎన్నికయ్యారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నెల రోజుల్లో పూర్తయ్యింది. గతనెల 14న సామాజిక వర్గాల జనాభా ఆధారంగా ఎవరికి ఎన్ని వార్డులు అన్నది ఖరారు చేశారు. 17 న మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు వార్డులకు రిజర్వేషన్లు ఖరార య్యాయి. 27న ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్‌డ్రా పూర్తయి బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను వెలువరించారు. 11న పోలింగ్ నిర్వహించారు. 13న ఓట్ల లెక్కింపు జరిగింది. సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించారు.
ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ఖరారు నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అధికారులు ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రక్రియను పూర్తి చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసు శాఖ కూడా ఆరోపణలకు తావులేకుండా వ్యవహరించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగిన నెల రోజుల కాలంలో పెద్దగా గొడవలు, వివాదాలు చోటుచేసుకోలేదు. పోలింగ్ రోజున అక్కడక్కడ చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో జోష్ తెచ్చాయి. మూడు మున్సిపాలిటీలను సునాయాసంగా గెలుచుకున్న కాంగ్రెస్.. కామారెడ్డి బల్దియాను మాత్రం బీఆర్‌ఎస్‌తో అవగాహనతో తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
నాలుగు మున్సిపాలిటీలు హస్తగతం
కామారెడ్డిలో మాత్రం
బీఆర్‌ఎస్‌తో అవగాహన
చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్, వైస్‌చైర్‌పర్సన్‌గా
బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు అవకాశం
ప్రశాంతంగా ముగిసిన మున్సిపోల్స్


