పాలమూరు పీఠం.. అంతా నాట‘కీ’యం!
శిబిరంలోకి పోలీసుల రాకతో..
చర్చల తతంగం నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్‌కు సంబంధించిన రాష్ట్ర, జాతీయ స్థాయి ముఖ్యనేతల నుంచి ఓ కార్పొరేటర్‌కు మేయర్ పదవి ఇవ్వాలని ముఖ్య నేతకు ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఆమెకు ఇచ్చిన పక్షంలో ముఖ్య నేత వర్గానికి చెందిన నాయకులు మా దారి మేం చూసుకుంటామని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో తాను చెప్పిక వారికే మేయర్ పదవి ఇవ్వాలని.. లేకుంటే తాను తీసుకునే నిర్ణయానికి మీరే బాధ్యులవుతారని పెద్దలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది.
ఆద్యంతం ఉత్కంఠ రేపిన పరిణామాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన మహబూబ్‌నగర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకున్నా.. మేయన్ పదవి కోసం చోటుచేసుకున్న రాజకీయాలు ఆద్యంతం ఉత్కంఠ రేపాయి. 13న ఫలితాల అనంతరం హస్తం నుంచి గెలుపొందిన 29 మందితో పాటు స్వతంత్రులు నలుగురిని ఏపీలోని చీరాల క్యాంప్‌నకు తరలించిన నాటి నుంచీ నాటకీయ పరిణామాలు నిత్యకృత్యంగా మారాయి. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక అటు డీసీసీ, ఇటు ఎమ్మెల్యే, ఆయన వర్గంగా ముద్రపడిన పలువురు నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఈ అంశం రాష్ట్ర, డిల్లీ పెద్దల చేతుల్లోకి వెళ్లడంతో చివరకు క్యాంప్ చీరాల నుంచి హైదరాబాద్‌కు మారింది. మేయర్‌గా తొలుత ఒకరు.. తర్వాత మరొకరు.. ఇంకొకరు అంటూ ఆదివారం అర్ధరాత్రి దాటే వరకు హైడ్రామా కొనసాగింది. ఇక ప్రమాణ స్వీకారం రోజు సోమవారం ఉదయం మహబూబ్‌నగర్‌కు బయలుదేరుతున్న క్రమంలో శిబిరానికి పోలీసులు రావడం వంటి తదితర ఘటనలు పాలమూరును హీటెక్కించాయి. ప్రమాణ స్వీకార సమయంలో ముందుగా చర్చకు వచ్చిన వారిలో ఏ ఒక్కరి పేరు లేకుండా మేయర్‌గా మూడో డివిజన్‌కు చెందిన గుమాల మమత పేరును ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది.
వన్.. టూ.. త్రీ.. ఫోర్..
మేయర్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. ఈ పదవిపై 49వ డివిజన్ నుంచి గెలుపొందిన ప్రసన్న ఆనంద్‌గౌడ్‌తోపాటు ఎన్పీ వెంకటేష్ కూతురు ఎన్పీ నేహా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న నేహా, స్వప్న ఓటమి చెందడంతో ప్రసన్నకే పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే క్యాంప్‌లో 39వ డివిజన్‌లో గెలుపొందిన సిరాజ్‌ఖాద్రి భార్య హజీరా బేగం పేరు ప్రతిపాదనకు వచ్చింది. డీసీసీ వర్గ నేతలు విభేదించి ప్రసన్న పేరును సూచించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే, ఆయన వర్గం ప్రసన్నకు ససేమిరా అనడంతోపాటు హజీరా బేగం వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో డీసీసీ నేతలు వారికి చెప్పకుండా.. క్యాంప్ నుంచి అర్ధంతరంగా మహబూబ్‌నగర్‌కు వచ్చారు.
డీసీసీ, ఎమ్మెల్యే, ఆయన వర్గం మధ్య విభేదాలు బహిర్గతం
వర్గాల వారీగా ఆధిపత్యం చుట్టే తిరిగిన నేతల రాజకీయాలు
చీరాల నుంచి హైదరాబాద్‌కు మారిన క్యాంప్‌లోఅనూహ్య ఘటనలు
తొలుత చర్చకు వచ్చిన ముగ్గురు కాదని కొత్త పేరు తెరపైకి..
చివరకు ముదిరాజ్ మహిళ మమతకు దక్కిన మేయర్‌గిరి


